కోట గురుకులం మూసివేత దారుణం | - | Sakshi
Sakshi News home page

కోట గురుకులం మూసివేత దారుణం

Aug 15 2026 2:03 AM | Updated on Aug 15 2026 2:03 AM

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నెల్లూరురూరల్‌: కోట మండలంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను మూసివేసి విద్యార్థులను ఖాళీ చేయించడం దారుణమని వివిధ సంఘాల నాయకులు అన్నారు. ఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వీరంరెడ్డి సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తామన్నారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న గురుకుల పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. గత నెల 18వ తేదీన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తమ పిల్లలను వెంటనే తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చారన్నారు. 19వ తేదీన పాఠశాలను పూర్తిగా ఖాళీ చేయించారని ఆరోపించారు. 10.5 ఎకరాల స్థలాన్ని ‘ఐఐటీ’ పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకే ఈ చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. నారా లోకేశ్‌, టీడీపీ ప్రభుత్వం పేదపిల్లల్ని విద్యకు దూరం చేసే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ఇలాంటి అనైతిక విధానాలను కొనసాగిస్తే రానున్న రోజుల్లో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు హేమంత్‌, వర్షిత్‌, మిషాక్‌, అలీ, రియాజ్‌, ఐఎస్‌ఎఫ్‌ నాయకులు పవన్‌, జశ్వంత్‌, అబ్బు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement