నెల్లూరు(క్రైమ్): పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా విధులుగా నిర్వహిస్తున్న నెల్లూరు ఏఆర్ డీఎస్పీ ఎస్.చంద్రమోహన్ అత్యున్నతమైన మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎస్‌ఎం) వరించింది. విడవలూరుకు చెందిన చంద్రమోహన్ 1992లో ఆర్‌ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. 2008లో ఆర్‌ఐగా, 2022లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. 2024 నవంబర్ నుంచి నెల్లూరు ఏఆర్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో పనిచేసే సమయంలో నిషేధిత సామాజిక వ్యతిరేక శక్తుల కదలికలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారు. పనిచేసిన ప్రతిచోటా సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషిచేశారు. ఆయన సేవలకు 2017లో సేవా పతకం, 2022లో ఉత్తమ సేవా పతకం, 22 నగదు బహుమతులు, 38 జీఎస్‌ఈ (గుడ్ సర్వీస్ ఎంట్రీ), ఒక ఎంఎస్‌ఈ (మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీ), 30 ప్రశంసాపత్రాలు, ఇతర పురస్కారాలు లభించాయి. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎం ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.


