బతుకుదారిలో మృత్యుగుంత | - | Sakshi
Sakshi News home page

బతుకుదారిలో మృత్యుగుంత

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

చిల్లకూరు: మామిడి తోటలో దుక్కి దున్నేందుకు వచ్చిన తండ్రీ కొడుకులు ఇద్దరు చీకట్లో తోట వద్దకు వెళ్లే సమయంలో ట్రాక్టర్‌ బోల్తాపడి తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా కొడుకు తీవ్రగాయలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన మండలంలోని కడివేడు చెరువు సమీపంలో గురువారం వేకువజామున జరిగింది. పోలీసుల సమచారం మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మేదరకాలనీకి చెందిన పోట్లూరి రమణయ్య (50), ఆయన కుమారుడు పోట్లూరి శీనయ్య (29) రెండు రోజుల క్రితం కడివేడులోని ఓ మామిడి తోటలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నేందుకు వచ్చారు. ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తండ్రీ కొడుకులు ఇద్దరు బుధవారం రాత్రి కడివేడుకు ట్రాక్టర్‌లో వచ్చి వేకువ జామున తోట వద్దకు వెళుతుండగా చెరువు సమీపంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌ కింద ఇద్దరు పడి బయటకు రాలేని స్థితిలో ఉండగా శీనయ్య అత్యవసర సర్వీస్‌ 112కు సమాచారమిచ్చాడు. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ కింద ఇరుక్కుపోయిన ఇద్దరిని బయటకు తీయగా అప్పటికే తండ్రి రమణయ్య మృతి చెందాడు. కుమారుడు శీనయ్య తీవ్ర గాయాలతో ఉండడంతో 108 ద్వారా అతన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. వారి వద్ద ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా ప్రమాద విషయం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రమణయ్య

శీనయ్య

ట్రాక్టర్‌ బోల్తా .. తండ్రీకొడుకుల

దుర్మరణం

కళ్ల ముందే ఆగిన తండ్రి ఊపిరి

ఆఖరి శ్వాస వరకు పోరాడిన కుమారుడు

కూలి పనుల కోసం వచ్చి విషాదం

పొట్టకూటి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటూ, చెమట చుక్కలను నమ్ముకున్న ఆ శ్రమజీవుల పాలిట కారు చీకట్ల వేకువే కాళరాత్రయింది. చీకటిని చీల్చుకుంటూ వెళ్తున్న ఆ తండ్రీకొడుకుల ప్రయాణం.. ఊహించని గుంత రూపంలో మృత్యువై ఎదురొచ్చి అర్ధాంతరంగా నూరేళ్ల జీవితాన్నే చీకటి మయం చేసింది. కన్నతండ్రి కళ్లముందే ఊపిరొదిలితే, అపార వేదనతో ఆఖరి శ్వాస వరకు పోరాడిన ఆ కొడుకు ఆర్తనాదం నిశీధి నిశ్శబ్ధంలో కలిసిపోయింది. ఈ దారుణ విషాదం.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement