● కలెక్టర్ హిమాన్షు శుక్లా
మనుబోలు: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గురువారం మనుబోలుతో ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆర్‌ఎస్‌కేలు, చెత్త సంపద కేంద్రం, సచివాలయాలను పరిశీలించి వాటి పనితీరును సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అధికారులందరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. జలధార–జలహారతి కార్యక్రమాన్ని వీబీజీ రామ్‌జీ కార్యక్రమంతో అనుసంధానం చేసుకుని ఫీడర్ చానల్స్, కాలువల్లో పేరుకుపోయిన పూడికి, చెత్త, పాచి తొలగింపు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్‌నినోని కారణంగా తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రైతులు ప్రత్యామ్నాయంగా పాడి, మెట్ట పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ శాఖ ద్వారా చాంపియన్ ఫార్మర్స్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. మనుబోలు మండలంలో శ్యామ్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలిపారు. పాడుబడిన అండర్ టన్నెల్ పునరుద్ధరణకు రూ.1.67 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. డేగపూడి–బండేపల్లి కాలువ మిగిలిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలకు సంబంధించి సాంకేతిక సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు.


