నెల్లూరురూరల్: జిల్లాలో 3.22 లక్షల ఎకరాల్లో సాగవుతున్న రెండో పంట వరికి చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. ప్రతి ఎకరా పంటను కాపాడేందుకు అవసరమైన మేరకు సాగునీటిని సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి అధ్యక్షతన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న 30 రోజులు అత్యంత కీలకమని, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని సూచించారు. నెల్లూరు, కోవూరు డెల్టాలతోపాటు కావలి, దక్షిణ, కందుకూరు కాలువల్లో నీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కావలి కాలువ 12వ కిలోమీటర్ వద్ద ఉన్న సైఫన్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలుగుగంగ పరిధిలో నెల్లూరు, తిరుపతి జిల్లాల రైతులకు రెండో పంటకు అవసరమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సోమశిల, కండలేరు, ఇరిగేషన్ ఎస్‌ఈలు జి.రామచంద్రమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, దేశ్‌నాయక్, జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.


