● హుండీలను ఎత్తుకెళ్లిన దుండగులు
● క్లూస్‌టీం ఆధారాల సేకరణ
కొండాపురం: మండలంలోని సాయిపేట గ్రామంలో సోమవారం రాత్రి నాలుగు ఆలయాల్లో చోరీలు జరిగాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న వీర్ల అంకమ్మతల్లి ఆలయంలో హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇటీవలే తిరునాళ్ల నిర్వహించడంతో హుండీలో సుమారు రూ.75 వేల వరకు కానుకల నగదు ఉండొచ్చని స్థానికులు తెలిపారు. అలాగే బస్టాండ్ సెంటర్‌లోని అంకమ్మతల్లి ఆలయంలో హుండీని అపహరించారు. రెండేళ్లుగా హుండీ కానుకలను లెక్కించలేదని, త్వరలో తిరునాళ్ల ఉండటంతో అనంతరం లెక్కించాలని భావిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో సుమారు రూ.లక్ష వరకు నగదు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ కాలనీలోని అంకమ్మతల్లి ఆలయంలోని హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో సుమారు రూ.25 వేల వరకు కానుకలు ఉండొచ్చని భావిస్తున్నారు. గ్రామ శివారులోని గంగమ్మతల్లి ఆలయ తాళాన్ని పగలగొట్టినప్పటికీ అక్కడ ఎలాంటి చోరీ జరగలేదని స్థానికులు చెప్పారు. అదే విధంగా స్థానిక సచివాలయం వెనుక ముళ్లపొదల్లో రెండు హుండీలను గుర్తించారు. మరో రెండు కనిపించకపోవడంతో దుండగులు ఎత్తుకెళ్లినట్లు భావిస్తున్నారు. ఘటనపై గ్రామస్తులు కొండాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం క్లూస్‌టీం సిబ్బంది ఘటనా స్థలాలకు చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


