కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలు | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలు

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలకు అన్ని వర్గాల ప్రజల నుంచి లభించిన మద్దతు, స్పందనను చూసి కూటమి ప్రభుత్వ పెద్దలలో వణుకు మొదలైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. డీఎస్సీ నిరసన కార్యక్రమాలకు సంబంధించి గత నెలలోనే పోలీసు అనుమతులు కోరామని తెలిపారు. అప్పుడు మిన్నకుండిన పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం ప్రభుత్వ ప్రోద్బలంతో నిరసన దీక్షలు, ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. అయితే పార్టీ శ్రేణుల అప్రమత్తతతో ఎక్కడికక్కడ వారి ఆగడాలను అడ్డుకోగలిగామన్నారు. జిల్లాలో నిరసన కార్యక్రమాలు టీడీపీ ఊహించిన దానికంటే, తాము ఆశించిన దానికంటే ఎక్కువగా విజయవంతమయ్యాయని, దీన్నిబట్టి ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. తమ పార్టీ నిరసనలను ఓర్వలేక కూటమి ప్రభుత్వ పోలీసులను పురమాయించి దీక్షా శిబిరాల టెంట్లను పీకేసేందుకు ప్రయత్నించడం, తమ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడడం, దాడులకు తెగబ డడం, చివరకు పార్టీ ఫ్లెక్సీలను చించివేయడం వంటివి చేశారన్నారు. తాము అరగంట పాటు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే అనేక అడ్డంకులను సృష్టించిన పోలీసులు ఇటీవల మంత్రి నారాయణ సైకిళ్ల పంపిణీ పేరుతో ఒక రోజంతా వీఆర్సీ సెంటర్‌ నుంచి గాంధీబొమ్మ వరకు ట్రంకురోడ్డును బ్లాక్‌ చేసి ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం,ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్పిండం కనబడ లేదా అని ప్రశ్నించారు. సాధారణ జనజీవనానికి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కేసులు పెట్టాల్సివస్తే ముందుగా మంత్రి నారాయణపై నమోదు చేయాలని హితబోధ చేశారు. టీడీపీ ఎప్పుడూ అధికారంలో ఉండదని, ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారికి వత్తాసుపలికి పోలీసు శాఖపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు.నిరసన దీక్షలో పాల్గొన్న డీఎస్సీ బాధితులను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు కూడా ఈ ప్రభుత్వం వెనుకాడలేదన్నారు.వైఎస్సార్‌సీపీ నిరసనలను నేరుగా ఎదుర్కోలేక డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన కొందరిని ఉసిగొల్పేందుకు ప్రయత్నించి ఘోరంగా విఫలమైందన్నారు. మెగా డీఎస్సీ నియామకాలపై మంత్రి నారాయణ క్లీన్‌చిట్‌ ఇచ్చాడని టీడీపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆయన ఏమైనా సీబీఐ ఆఫీసరా అని ప్రశ్నించారు. అదృష్టం కలిసొచ్చి మంత్రి అయిన నారాయణకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. విద్యాశాఖ మంత్రిగా కొనసాగే ప్రతిభ, అర్హత లోకేశ్‌కు లేవని, డీఎస్సీ స్కామ్‌కు నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మోసపూరిత ప్రకటనలు, ఆచరణ సాధ్యం కానీ హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అంటూ ప్రజల మధ్యకు రావడం సిగ్గుచేటని, కరపత్రాలతో వచ్చిన టీడీపీ నాయకులను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. డీఎస్సీ స్కామ్‌పై తమ పార్టీ చేపట్టిన రిలే దీక్షలు, ర్యాలీలకు మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపిన మేధావులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు, డీఎస్సీ బాధితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తప్పులను సరిదిద్ధుకునే

ప్రయత్నం చేయడం లేదు

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ స్కామ్‌పై తమ పార్టీ ఆధ్వర్యంలో తాము మొదటి నుంచి ఎప్పటికప్పుడు ఆందోళనలు చేపడుతున్నా ప్రస్తుత పాలకులు తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా, తమ మీద తప్పుడు కేసులతో ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. ఎన్‌సీఈఆర్టీలో టైపిస్టుగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి పేపర్‌ లీకేజీకి పాల్పడితే అతనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఒక్కో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కనీసం రూ.15లక్షలకు అమ్ముకున్నట్లు తాము ఆడియో రికార్డులు,తగిన సాక్ష్యాధారాలను చూపించిన ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దీనిని బట్టి అవినీతి, అక్రమాల్లో విద్యాశాఖ మంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే విషయం స్పష్టంగా అర్ధమవుతోందన్నారు.

వైఎస్సార్‌సీపీ రిలేదీక్షలు,

ర్యాలీలకు అనూహ్య స్పందన

ఓర్వలేక పోలీసులతో అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

బాధితుల పక్షాన నిలబడతాం

నెల్లూరురూరల్‌ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వం చేత దగాపడిన బాధితుల పక్షాన నిలబడతామని తెలిపారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. లోకేశ్‌ మంత్రిగా కొనసాగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రాజీనామా చేయించాలన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి నిధులను తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆత్మకూరు, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజితమ్మ, జోనల్‌ ప్రెసిడెంట్‌ మొయిళ్ల గౌరి, లక్ష్మీసునంద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement