నెల్లూరు(పొగతోట): మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అంటే అభివృద్ధి విఘాతకుడని, ఆయన ఎక్కడ ప్రాతినిథ్యం వహిస్తే.. అక్కడ అవినీతి తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం ఆయన నెల్లూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల మర్రిపాడులో జరిగిన సభలో టీడీపీ కార్యకర్త హైలెవల్ కెనాల్ పనులకు సంబంధించి మంత్రి ఆనంను ప్రశ్నించగా మర్రిపాడు వాసులకు సిగ్గు లేదంటూ మాట్లాడారన్నారు. టీడీపీ కార్యకర్త అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మా కుటుంబం మీద విమర్శలు చేయడం ఆయన కుసంస్కారానికి నిదర్శమన్నారు. ఎవరి హయాంలో ఆత్మకూరు అభివృద్ధి సాధించిందో..ఇక్కడి ప్రజలందరికీ తెలుసన్నారు. తమ కుటుంబంపై ఈ ప్రాంత ప్రజల్లో ఎంతో అభిమా నం ఉందన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబం మెట్ట ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు.
రెండేళ్లుగా మంత్రి చేసిన అభివృద్ధి చెప్పాలి
సమస్యలపై అధికార పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారంటే.. ఇక్కడి అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందన్నారు. ఆనం గెలిచిన సాయంత్రమే మర్రిపాడులోని ఇసుక కొండను మాయం చేశారని, రెండ్రోజుల తర్వాత ఆయన ఇంటి ముందు రెండు కొత్త వాహనాలు కనిపించాయని ఆరోపించారు. నియోజకవర్గంలో ఏటికి ఒక వైపు ఒకరిని, ఆవతలి వైపు మరొకరిని పెట్టి ఇసుక దందా సాగిస్తున్నారన్నారు. ఆయన ధనదాహానికి ఇసుక టిప్పర్ ఢీకొని ఏడుగురు మరణించగా, ఇప్పటి వరకు ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. చేజర్ల మండలంలో సుమారు 150 ఎకరాల్లోని జామాయిల్‌ను పోలీసుల సమక్షంలో బద్వేలుకు చెందిన వ్యక్తులతో రాత్రికి రాత్రే తరలించి స్వాహా చేశారని ఆరోపించారు. ఆఖరికి చికెన్ వేస్ట్‌ను కూడా అమ్ముకుంటూ ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారన్నారు. దానిని స్యయంగా తానే మీడియా ద్వారా చూపించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇటువంటి పనులు చేయడానికి మీకు సిగ్గుండాలన్నారు.
వైఎస్సార్ జలయజ్ఞం.. రిబ్బన్ కత్తిరించిన ఆనం
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా హైలెవల్ కెనాల్ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారని గుర్తుచేశారు. అప్పట్లో మంత్రిగా ఉండి హైలెవల్ కెనాల్‌కు ప్రారంభోత్సవం చేయించారే తప్పా అందులో ఆనం పాత్ర ఏ మాత్రం లేదన్న విషయం అందరికీ తెలుసునన్నారు. హైలెవల్ కెనాల్ నిర్మాణాన్ని ప్రారంభించి 19 ఏళ్లు కాగా, 13 ఏళ్లు ఆనమే ఇన్‌చార్జిగా ఉన్నారని గుర్తుచేశారు. పొంగూరు, చాబోలు రిజర్వాయర్లు నిర్మించాలంటే ముందు భూసేకరణ చేయాలని, మంత్రిగా ఉండి ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి కలెక్టర్ ద్వారా భూసేకరణకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్‌కు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చేది నేనే..ఇచ్చేది నేనే అంటున్న ఆనం ఒక్కసారి చరిత్ర చూడాలన్నారు. వెంకటగిరిలో రిజర్వాయర్ నిర్మాణానికి మీకు అడిగినంత కమీషన్ ఇవ్వలేదని పనులు నిలిపివేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. సోమశిల స్పిల్‌వే నిర్మాణానికి కాంట్రాక్టర్లు మారారే తప్ప ఇప్పటికీ అతి ముఖ్యమైన పనిని చేపట్టలేదన్నారు. అధికారం కోసం తరచూ పార్టీ మారే ఆనం మా కుటుంబాన్ని దూషించడం సిగ్గుమాలినతనమన్నారు. అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతున్న ఆనం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వచ్చే దుమ్ముందా అని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, జెడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
అధికారం, అవినీతి తప్ప..
ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదు
ఊసరవెల్లి వంటి మీరా
మమ్మల్ని విమర్శించేది
ఇసుక దందాతో ప్రాణాలు కోల్పోయిన వారిని పట్టించుకున్నారా?
ఎవరికి సిగ్గులేదో ప్రజలందరికీ తెలుసు
మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి


