● సమస్యలపై కలెక్టరేట్‌కు
పోటెత్తిన అర్జీదారులు
నెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. తహసీల్దార్లు, మండల అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. అయినా మా సమస్యలు పరిష్కరించలేదు. తిప్పుకొంటూనే ఉన్నారు. మీరైనా మా గోడు వినండి’ అని పలువురు బాధితులు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు అర్జీలు స్వీకరించారు.
దళిత మహిళను కొట్టిన సీఐపై కేసు నమోదు చేయాలి
బుజబుజనెల్లూరుకు చెందిన యెంబేటి కరుణమ్మ అనే వృద్ధురాలిని దూషించి, చెంపపై కొట్టిన వేదాయపాళెం సీఐపై కేసు నమోదు చేయాలి. సివిల్ వివాదమైనప్పటికీ ఈ వ్యవహారంలో సీఐ అత్యుత్సాహం ప్రదర్శించి ఆమెను భయభ్రాంతులకు గురిచేసి కొట్టారు. ఈ విషయంపై జూన్ 8న కలెక్టర్, ఎస్పీకి అర్జీలు ఇచ్చాం. ఇప్పటివరకు విచారణ జరగలేదు. సీఐపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– పందిటి సుబ్బయ్య, రవి రాఘవేంద్ర, కుడుముల సుబ్బారావు, వాదనాల వెంకటరమణ, దళిత సంఘాల
ఐక్య వేదిక నాయకులు


