కోవూరు: రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపంలో కిలోమీటర్ నంబర్ 178/2 – 4 పోస్టుల మధ్య చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు తెలుపు రంగు చొక్కా, బులుగు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఎడమ చెవికి కమ్మ ఉంది. కుడి చేతిపై సుబ్బమ్మ అని ఇంగ్లిష్, ఎన్టీఆర్ అక్షరాలతో టాటూలు, త్రిశూలం గుర్తులున్నాయి. మృతుడి వివరాలు తెలిసిన వారు 83280 86971 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కావలి జీఆర్పీ ఎస్సై కె.వెంకట్రావు కోరారు.
620 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం
నెల్లూరు(పొగతోట): అక్రమంగా తరలిస్తున్న 620 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నామని డీఎస్‌ఓ పుల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించామన్నారు. లారీ (ఏపీ 26 టీఈ 1233)లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బియ్యం, లారీని స్వాధీనం చేసుకుని వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు అప్పగించామన్నారు. సంబంధించిన వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. తనిఖీల్లో సీఎస్ డీటీలు సైమన్‌బాబు, అజేయుల్లాఖాన్ పాల్గొన్నట్లు వెల్లడించారు.
రైలు కింద పడి బలవన్మరణం
గూడూరు: గూడూరు – వెంకటగిరి మధ్యలో నిడిగల్లు రైల్వేస్టేషన్‌కు సమీపంలో సోమవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాంగ్‌మెన్లు ఇచ్చిన సమాచారం మేరకు గూడూరు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. నిడిగల్లు రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారం దక్షిణం వైపు చివరగా సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తల, మొండెం వేరయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు.
కండలేరులో 23.75 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 23.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 90, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


