● కలెక్టరేట్‌లో అందుబాటులో లేని వీల్‌చైర్
నెల్లూరు(అర్బన్): ఆ వృద్ధుడి పేరు పెద వీరయ్య. వయసు సుమారు 89 ఏళ్లు. ఏఎస్‌పేట మండలం దూబగుంట గ్రామానికి చెందిన ఆయన తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చాడు. కాలికి గాయం కావడంతో కట్టు కట్టుకుని ఉన్నాడు. నడవలేని పరిస్థితి. దీంతో ఇద్దరి సాయంతో ఊతకర్ర పట్టుకుని కష్టంగా నడుస్తూ జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌లో వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో నడవలేని వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు పట్టుకుని లోపలకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ.. నడవలేని వృద్ధుడికి కనీసం వీల్‌చైర్ కూడా అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది.
మ్యుటేషన్ మార్చాలంటూ..
తనకు తెలియకుండా పట్టా భూమిని వేరే వ్యక్తుల పేరుపై మ్యుటేషన్ చేశారని వీరయ్య ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై న్యాయం కోసం పలుమార్లు ఏఎస్‌పేట మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందన లేదని వాపోయారు. తనకు తెలియకుండా చేసిన మ్యుటేషన్‌కు సంబంధించిన పత్రాలివ్వాలని కోరినా అధికారులు స్పందించడం లేదని తెలిపారు. ‘అధికారులు చేసిన తప్పు నాకెందుకు శాపంగా మారింది?’ అంటూ వీరయ్య ప్రశ్నించారు.


