దగదర్తి: ఆ కుటుంబం నెల్లూరు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని తమ స్వగ్రామానికి కారులో బయలుదేరింది. ఈ క్రమంలో సున్నపుబట్టి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి చనిపోయింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని జ్యోతి నగర్‌లో వ్యాపార నిమిత్తం పఠాన్ ముస్లిం ఖాన్ తన కుటుంబంతో ఉంటున్నాడు. వారంతా కలిసి కారులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తమ స్వగ్రామమైన బైసా గ్రామానికి బయలుదేరారు. కారును ముస్లింఖాన్ నడుపుతున్నాడు. సున్నపుట్టి జామాయిల్ ఫారెస్ట్ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు హైవే ఫోర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ముస్లిం ఖాన్ కుమార్తె పఠాన్ జైనబ్ ఫాతిమా (3)ను హైవే అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ముస్లింఖాన్ భార్య ఉ జ్మఖాన్, తమ్ముడు హాసిల్ ఖాన్, కుమారుడు పఠాన్ ఆయత్ ఖాన్, కుమార్తె పఠాన్, ట్రాక్టర్ డ్రైవర్ బత్తుల శ్రీనివాసులుకు గాయాలయ్యాయి. ఇతడిని కొడవలూరు మండలం పెయ్యలపాళెం గ్రామవాసిగా గుర్తించారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్సై మహేంద్ర తెలిపారు.


