చిల్లకూరు: ఇద్దరు యువకులు మద్యం మత్తులో మైసూర్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం రైల్వే పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీ రాత్రి మైసూర్ నుంచి దర్బాంగా బయలుదేరిన రైలు గూడూరు రైల్వేస్టేషన్ దాటుతోంది. పార్శిల్ ఆఫీస్ దగ్గర రైలుపై రాళ్లు విసిరారు. దీంతో కిటికి పక్కన కూర్చుని ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరులో రైలు నిలిపి అతడికి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దుండగుల కోసం గాలించారు. సోమవారం గూడూరు రైల్వేస్టేషన్ వద్ద ఇందిరమ్మ కాలనీకి చెందిన అసనాపురం రాజేష్, గాంధీ నగర్‌కు చెందిన సూరిపాక విగ్నేష్‌ను పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లుగా నెల్లూరు రైల్వే ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. గూడూరు రైల్వే ఎస్సై ఎం.నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


