● మరో యువకుడి పరిస్థితి విషమం
● క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించకుండా వెళ్లిపోయిన వైనం
● క్షతగాత్రులను పట్టించుకోని దుర్మార్గం
● ఘటనపై కేసు కూడా నమోదు కాలేదని సమాచారం
కావలి: పొంగళ్ల వేడుకకు వెళ్తున్న టీడీపీ నేత కారు ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల కథనం మేరకు.. కావలికి చెందిన టీడీపీ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి జనిగర్ల మహేంద్ర యాదవ్ ఆదివారం ముందర పొట్టెమ్మ తల్లి వద్ద పొంగళ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన కారులో వెళ్తూ కావలి – తుమ్మలపెంట రోడ్డుపై బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్తుండగా మండలంలోని అడవి రాజుపాళేనికి చెందిన మంద వాసు (22) మృతిచెందాడు. మరో యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వాసు ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు.
ప్రాణాలు పోతుంటే..
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి అక్కడి నుంచి వెళ్లిపోయారన్న ఆరోపణలున్నాయి. ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలో ప్రాణాలతో పోరాడుతుండగానే పొంగళ్ల కార్యక్రమం యథావిధిగా కొనసాగడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్న ఘటనపై కేసు కూడా నమోదు కాలేదని సమాచారం. దీంతో ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రమాదానికి కారణాలు, బాధ్యులను తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు, క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


