● క్షేత్రస్థాయి విచారణ లేకుండానే
‘పరిష్కారం’ ముద్ర
● రెవెన్యూ శాఖ ఫిర్యాదులే అధికం
● వినతులు.. బుట్టదాఖలు
● ఆత్మకూరు మండలం నాగులపాడుకు చెందిన రైతు దేవూరు కమలాకర్‌కు గ్రామంలో సర్వే నంబర్ 178లో 2 ఎకరాలు భూమి పిత్రార్జితం ద్వారా సంక్రమించింది. ఆ భూమిని కొందరు బడా వ్యక్తులు రికార్డులు తారుమారు చేసి నకిలీ పాసు పుస్తకాలు సృష్టించుకుని భూ ఆక్రమణ చేశారు. తన సమస్యను పరిష్కారం చేసి న్యాయం చేయాలని ఆయన ఇప్పటికి ఐదుసార్లు కలెక్టర్ ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమంలో అర్జీలు ఇస్తూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆయన సమస్య పరిష్కారం కాకపోగా పరిష్కరించినట్లు అధికారులు ముద్రవేస్తున్నారు.
● ఈయన పేరు లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి. జలదంకి మండలం కొత్తపాళెం. ఆయన కుటుంబానికి కలిగిరి మండలంలో 12.02 ఎకరాల పట్టా భూమి ఉంది. పక్కనే ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమికి దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు ఇతని పట్టా భూమిని కూడా ఆక్రమించుకుంటున్నారు. స్థానిక తహసీల్దార్ కూడా ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నాడనే ఆరోపణలు చేస్తూ.. న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి 45 దఫాలు అర్జీలిచ్చాడు. గత సోమవారం 46వ దఫా అర్జీ కలెక్టర్‌కు ఇచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నాడు. తమకు భూమి లేకపోతే బతుకే లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. న్యాయం చేయలేకపోతే తన కుటుంబానికి కారుణ్య మరణానికై నా అనుమతించాలని వేడుకున్నాడు. కలెక్టర్ మాత్రం షరా మామూలే అన్నట్లు.. ఇతనికి ద్రోహం తలపెట్టిన తహసీల్దార్‌కు రెఫర్ చేశారు. అయితే రికార్డుల్లో సమస్యను పరిష్కరించినట్లు ఆన్‌లైన్ ఎక్కించేశారు. క్షేత్ర స్థాయిలో అయితే సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.
● ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లెకు చెందిన కరవళ్ల రవీంద్రరెడ్డి పొలానికి సంబంధించి రీసర్వేలో అధికా రులు తప్పులు చేశారు. ఆ విషయాన్ని సరిదిద్దమని ఆయన కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ ఇచ్చారు. అయినా పరిష్కరించలేదు. ఆయన మాత్రం క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాడు.
● కలువాయి మండలం తోపుగుంట అగ్రహారానికి చెందిన నాపా పెంచలయ్యకు ఆ గ్రామ పరిధిలో సర్వే నంబరు 21/2ఏలో 2.36 ఎకరాలు, 138/3ఈలో 0.03 సెంట్లు విస్తీర్ణం కలిగిన స్థిరాస్తి, ఇల్లును ఆయన తల్లికి పసుపు కుంకుమ ద్వారా సంక్రమించిన ఆస్తిని వీలునామా రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటి ఆ భూమి ఆయన ఆధీనంలో ఉంది. ప్రస్తుతం ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో (ఓఎస్ నంబరు 137/2024) విచారణ జరుగుతోంది. కోర్టులో సివిల్ కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసీ కూడా కలువాయి మాజీ, ఇన్‌చార్జి తహసీల్దార్లు పెంచలయ్య సోదరుడు నాపా నరసింహులు పేరుపై వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్ చేశారు. ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్‌కు ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఇప్పటికి పలుమార్లు అర్జీలు ఇచ్చాడు. ఆయనకు ఎటువంటి సమాచారం లేకుండానే క్లోజ్ చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. ప్రహసనంగా మారింది. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఆ రోజంతా స్వీకరించిన వినతులను.. సాయంత్రానికి బుట్టదాఖలు చేస్తున్న పరిస్థితి నెలకొందనే ఆరోపణలకు అనేక ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. ‘రెవెన్యూ అధికారులతో కలిసి కొందరు ధనబలవంతులు నా భూమిని ఆక్రమించారు. మా భూమిని రెవెన్యూ అధికారులు తారుమారు చేసి మరొకరి పేరిట బదలాయించారు’ కలెక్టర్‌కు తమ గోడు చెప్పుకొంటే.. న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో వ్యయప్రయాసలు పడి వచ్చి మొరపెట్టుకుంటే.. తిరిగి ఆ అర్జీలు తప్పు చేసిన తప్పుడు అధికారులకే పంపుతున్న దౌర్భాగ్య పరిస్థితి పరిపాలన వ్యవస్థ దౌర్భల్యానికి అద్దం పడుతోంది. రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలవంతులు సామాన్యుడి భూములను కబ్జా చేస్తే.. పరిష్కరించాల్సిన రెవెన్యూ వ్యవస్థ కబ్జాదారుల కొమ్ము కాస్తూ.. వివాద వ్యాజ్యాలకు కారణమవుతున్నారు. సామాన్య జనం కన్నీళ్లు.. అవినీతి మరిగిన అధికారుల రాతి గుండెలను కదిలించలేకపోతున్నాయి.
ఒకే సమస్యపై పదే పదే అర్జీలు
సామాన్య ప్రజల సమస్యకు పరిష్కారం చూపేందుకు అంటూ ప్రభుత్వం ప్రతి సోమవారం ఆర్భాటంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లాలో క్రమక్రమంగా తన అసలు ఉద్దేశాన్ని కోల్పోతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి సామాన్య జనులు తమ కష్టాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆత్రుతతో రోజువారి పనులు మానుకుని, అప్పులు చేసి, ప్రయాణ ఖర్చులు భరించి కలెక్టరేట్‌కు వస్తున్నారు. ‘ఈసారైనా న్యాయం జరుగుతుందేమో’ అనే ఆశతో పదే పదే అర్జీలు సమర్పిస్తున్నారు. కానీ వారాలు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమే.
అర్జీకి జవాబుదారీతనమేదీ..?
ప్రతి వారం వందలాది అర్జీలు స్వీకరించినట్లు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, వాటిలో ఎన్ని సమస్యలు నిజంగా పరిష్కారమయ్యాయనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. గణాంకాల్లో పరిష్కారాలు పెరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం యథాతథంగానే ఉండడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. ఒకే సమస్యపై పదేపదే అర్జీ వస్తుంటే.. ఎందుకు వస్తుందని ఆరా తీసి, ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో జవాబుదారీ తనం కనిపించడం లేదు. పీజీఆర్‌ఎస్‌లో నమోదవుతున్న ఫిర్యాదుల్లో అత్యధికం రెవెన్యూ శాఖకు సంబంధించినవే. భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సర్వే సమస్యలు, పట్టాదారు పాస్‌బుక్, సరిహద్దు వివాదాలు వంటి అంశాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సి ఉన్నా, చాలా చోట్ల చేయకుండానే పరిష్కరించినట్లు నమోదు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతి అర్జీకి జవాబుదారీ తనంగా ఉంటామని చెబుతున్న అధికారులు వాస్తవంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అర్జీదారుల సమస్యను పరిష్కరించకుండానే పరిష్కార ముద్ర వేయడం. నిర్ణీత గడువు దాటకుండా ఉండేందుకు కొందరు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా, బాధితులను సంప్రదించకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆన్‌లైన్‌లో ‘పరిష్కరించబడింది’ అని నమోదు చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి సమస్య అలాగే ఉండగా, కంప్యూటర్లో మాత్రం పరిష్కారమైనట్లు చూపించడం ద్వారా ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అల్లూరు మండలం తలమంచి రెవెన్యూ గ్రామంలోని నార్త్ ఆమూలూరు నివాసి మౌలాలికి చెందిన ఒక ఎకరా పట్టా భూమిని రీ సర్వేలో సర్వేయర్ పక్క పొలం వారి పేరు మీద ఎక్కించారు. ఇది తెలిసిన ఆ రైతు సంవత్సర కాలంగా సరి చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. మ్యుటేషన్‌కు కూడా డబ్బులు చెల్లించాడు. అంటే రెవెన్యూ ఉద్యోగులు తప్పు చేస్తే శిక్ష మాత్రం రైతులకు పడుతోంది. పైగా లంచాలిచ్చి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు చేసిన తప్పులను కూడా సరిచేయడం లేదు. ఇలాంటివి కోకొల్లలుగా జిల్లాలో ఉన్నాయి. కలెక్టర్ చూసి చూడనట్టు పోతుండటంతో పాలన.. పాలకులకు అనుకూలంగా మారిపోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


