నెల్లూరు రూరల్: డీఎస్సీ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రభుత్వ పెద్దలు ప్రెస్‌మీట్లలో క్లీన్ చిట్ ఇచ్చుకోవడం కాదని.. వాస్తవాలను తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలు, కోర్టులని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రిపై సీబీఐ విచారణకు ఆదేశించి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐ ముందు తాను బయటపెడతానని చెప్పారు. విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 1:1 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులకు కాల్‌లెటర్లిచ్చి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలివ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్లపైకి జెన్ జీ వచ్చే పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించిందని మండిపడ్డారు. 2029లో ప్రజలే తగిన సమాధానం చెప్తారని స్పష్టం చేశారు.


