వెంచర్లకు మట్టి తోలకాలు | - | Sakshi
Sakshi News home page

వెంచర్లకు మట్టి తోలకాలు

Aug 9 2026 12:11 AM | Updated on Aug 9 2026 12:11 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కోట మండలంలోని పలు గ్రామాలకు స్వర్ణముఖి నది నుంచి సాగునీరు అందించే చల్ల కాలువలో పూడికతీత పనులకు నీటిపారుదల శాఖ టెండర్లు ఆహ్వానించింది. గూడూరు ప్రాంతంలోని చెన్నూరుకు చెందిన అధికార పార్టీ నాయకుడు టెండర్‌ దక్కించుకున్నాడు. కాగా తమ ప్రాంతంలో బయటి ప్రాంతానికి చెందిన వ్యక్తులు పనిచేయడం ఏమిటని కోట మండల నాయకులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్ద వాపోయారు. దీంతో ఆయన ఇద్దరి మధ్య వివాదం లేకుండా పనులు కోట మండలానికి చెందిన నాయకులు చేసుకునేలా ఒప్పందం కుదిర్చారు. అంతే తమకు అడ్డేది అంటూ కోట నాయకులు చల్ల కాలువలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారు. వాస్తవానికి కాలువలో సుమారు 34 వేల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. అయితే అంతకు మించి తరలిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మండలంలో ఇలా..

కోట మండలంలోని స్వర్ణముఖి నది నుంచి చల్ల కాలువ ద్వారా మండలంలోని వంజివాక, అల్లంపాడు, ఉత్తమ నెల్లూరు, కొక్కుపాడు, దొరువుకట్ట గ్రామాల్లోని చెరువులకు సాగునీరు అందుతుంది. ఇందులో తొమ్మిది కిలోమీటర్ల మేర పూడికతీత పనులకు టెండర్‌ను తమ్ముళ్లు దక్కించుకున్నారు. కాగా ఇందులోని కట్టలను పటిష్టం చేసేందుకు ఇక్కడి మట్టి పనికి రాదంటూ బయట విక్రయించుకుంటున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే అధికార పార్టీ నేతలు కావడంతో వీరిని అడిగే వారు లేకుండాపోయారు.

కట్టలు బలహీనం

చల్లకాలువ తవ్వకాల వల్ల కట్టలు పటిష్ట పరిచాలనుకోకుండా బలహీన పరచాలని చూస్తున్నట్లు స్థానికులు వాపోయారు. చల్లకాలువలో మట్టి తవ్వకాలను ఇష్టానుసారంగా చేపడుతున్నా కనీసం ఇరిగేషన్‌ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరిగేషన్‌ అధికారులు మాత్రం కాలువలో పూడికతీత (డీసిల్టింగ్‌) పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అయితే రాత్రి పూట తవ్వకాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి రాలేదని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీ నాయకులకు ఇలాంటి పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగించుకుంటున్నారు.

గూడూరు ప్రాంతంలో కొత్తగా ఎక్కడ వెంచర్లు వేస్తున్నారు అనే విషయాలను తెలుగు తమ్ముళ్లు ముందుగా తెలుసుకుని అక్కడకు మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పగటి పూట చేయాల్సిన మట్టి తవ్వకాలను రాత్రి సమయంలో పెద్ద పెద్ద యంత్రాలను పెట్టి తవ్వి తరలించేస్తున్నారు. వీరికి మట్టి తవ్వకాలకు అనుమతులున్నా ఇంత కక్కుర్తి ఎందుకో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. రాత్రి పూట తవ్వకాలతో వాహనాలు వేగంగా తిరగడం వల్ల నిద్ర ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement