మనుబోలు: ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొన్న ఘటన మనుబోలులో జాతీయ రహదారిపై శనివారం జరిగింది. బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు మనుబోలు సమీపానికి చేరుకోగానే ముందు వెళ్తున్న లారీ నెమ్మదించడంతో ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. బస్సులో 22 మంది ప్రయాణికులుండగా, ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను పోలీసులు మరో బస్సులో తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో
డ్రైవర్, క్లీనర్ వీరంగం
మనుబోలు: ఫూటుగా మద్యం తాగిన లారీ డ్రైవర్, క్లీనర్‌లు వీరంగం చేశారు. ఈ ఘటన మండలంలోని కాగితాలపూరు రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మద్యం తాగిన లారీ డ్రైవర్, క్లీనర్ మధ్య ఓ మహిళ విషయంలో గొడవలు చెలరేగాయి. ఇద్దరూ కర్రలతో దాడులు చేసుకుంటూ జాతీయ రహదారిపైకి చేరుకోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఇద్దరూ కలిసి హైవేపై నిలిపిన వాహనాలపైనా దాడులకు దిగడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి
మనుబోలు: రైల్లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలో శనివారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. కొమ్మలపూడి–మనుబోలు రైల్వేస్టేషన్ మధ్య అప్‌లైన్‌లో వెళ్తున్న రైల్లో నుంచి సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి జారిపడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తెలుపు రంగు, ఫుల్ హ్యాండ్ షర్ట్, బులుగు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వైద్యుడిని అటకాయించి రాయితో దాడి
నెల్లూరు(క్రైమ్): డబ్బులివ్వలేదన్న కోపంతో వైద్యుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన ఘటన పొర్లుకట్ట సెంటర్‌లో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. పాత మున్సిపల్ కార్యాలయ సమీపంలో నివాసం ఉంటున్న వైద్యుడు రవీంద్రనాథ్ ఠాగూర్ శుక్రవారం రాత్రి పుత్తా ఎస్టేట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా పొర్లుకట్ట సెంటర్ వద్ద షఫీ, నాయబ్, మరో వ్యక్తి ఆయన్ను అడ్డుకున్నారు. డబ్బులివ్వాలని వారు డిమాండ్ చేశారు. తన వద్ద లేవని వైద్యుడు చెప్పడంతో ఆగ్రహించిన షఫీ రాయితో దాడిచేయగా, మిగిలిన ఇద్దరు కాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో వైద్యుడికి గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితుడు సంతపేట పోలీసులకు ఫిర్యాదు శారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
పొదలకూరు: పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి గ్రామం నుంచి రేషన్ బియ్యం తరలిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయ్స్ అధికారులకు పట్టుకున్న బియ్యాన్ని శనివారం అప్పగించారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ ఐ.పుల్లయ్య మాట్లాడుతూ బడా దోస్త్ వాహనంలో అక్రమ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని, డీటీ రవి ద్వారా విచారణ చేపట్టగా యద్దల పెంచలనర్సయ్య, పామర్తి పెంచలయ్య ఆటో సహాయంతో పామర్తి బాబు డ్రైవరుగా పొదలకూరు 53వ నంబర్ రేషన్ షాపు డీలర్ ప్రవీణ్ నుంచి 29 గోతాలలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ మేరకు వారిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. బియ్యం విలువ రూ.59,450 కాగా వాహనం విలువ రూ.3 లక్షలుగా నిర్ధారించామన్నారు. జేసీకి నివేదిక పంపామని వెల్లడించారు. తనిఖీల్లో పొదలకూరు సచివాలయ బిట్–4 వీఆర్వో పోలిరెడ్డి పాల్గొన్నారు.


