నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌లు, జాతీయ రహదారులు, జిల్లా ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 26 కేసులు, ఎంవీ యాక్ట్ కింద 325 కేసులు నమోదు చేసి రూ.1,46,190ల జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం సేవించిన వారిపై 20 కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 72 లాడ్జీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచామన్నారు. క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపడుతున్నామని, ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 112కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 93929 03143కు సమాచారం అందించాలని కోరారు.


