గూడూరు: విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు హ్యాకథాన్ ఉపయోగపడుతుందని వీఎస్‌యూ వీసీ శ్రీనివాసులు తెలిపారు. గూడూరు సమీపంలో ఉన్న ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో శనివారం కోడ్ స్ప్రింట్ నేషనల్ లెవల్ హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు కొత్త పరిచయాలు చేసుకోవడంతో పాటుగా వారిలో వారు పలు విషయాలపై చర్చించుకుని కొత్త ఆలోచనలకు దారి తీస్తాయన్నారు. ప్రతి ఏడాది కోర్సులు పూర్తి చేసుకుని లక్షల మంది ఉద్యోగాలు చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అలా కాకుండా కొత్త ఆలోచనలతో పరిశ్రమలు స్థాపించి మరికొంత మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు 950 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్వేపల్లి కల్యాణ్, వెంకటరెడ్డి, మోహన్, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.


