సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్ ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగలేదనే ఆరోపణలు మొదట్నుంచీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారంటూ అధికారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలుమార్లు తెలియజేసినా, వారు పెడచెవిన పెడుతూ వచ్చారు. ఏ విషయంపై ఆందోళన వ్యక్తమైందో అదే చివరికి నిజమైంది. ఓట్లకు భారీగా కోతేసి, ప్రక్రియ నిర్వహణపైనే నీలినీడలు కమ్ముకునేలా ఆఫీసర్లు వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ తంతు..
వాస్తవానికి జూన్ 15 నుంచి జూలై 24 వరకు సర్ ప్రక్రియ జరిగింది. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను అధికారులు శుక్రవారం ప్రచురించారు. దీన్ని చూడటంతోనే అసలు సత్యం వెల్లడైంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో గల 2460 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 19,74,240 మంది ఓటర్లుండేవారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా జాబితా మేరకు 2,90,064 ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం మహిళా ఓటర్లు 8,58,567.. పురుషులు 8,25,447.. ఇతరులు 162 మంది ఉన్నారు. మొత్తమ్మీద ప్రతిపక్షాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా మిస్సయ్యాయనే ప్రచారం జరుగుతోంది.
నేటి నుంచి క్లెయిమ్‌లు
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను శనివారం నుంచి స్వీకరించి క్లెయిమ్‌లను పరిష్కరించేలా ఏర్పాట్లను అధికారులు చేశారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి (ఈఆర్వో) / ఏఈఆర్వోకు తమ అభ్యంతరాలను తెలిపి క్లెయిమ్‌లను పరిష్కరించుకోవచ్చు. ఫారం – 6, 6ఏ, 7, 8 ద్వారా కొత్తగా పేరు నమోదు, మార్పు, తొలగింపు, చిరునామా సవరణ, ఎపిక్ వివరాల సవరణ వంటి అభ్యర్థనలను స్వీకరించనున్నారు. voters. eci. gov. in ద్వారా సైతం అభ్యంతరాలను సమర్పించవచ్చు. గడువు ముగిసేలోపు ఓటును తిరిగి పొందకపోతే ఇక శాశ్వతంగా పోయినట్టే. అందుకే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అక్కడోలా.. ఇక్కడోలా..!
మరోవైపు రాష్ట్ర కమిషన్ ప్రకటించిన జాబితాకు.. జిల్లా జాబితాకు మధ్య తేడా ఉంది. జిల్లాలో తొలగించిన ఓటర్లకు.. అధికారులు విడుదల చేసిన వివరాల్లో కొంత వ్యత్యాసముంది. ఒకవేళ ఇదే వాస్తవమైతే ఇది పారదర్శక జాబితా ఎలా అవుతుందనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.
మిగిలింది
16,84,176 మందే
సర్ ముసాయిదా జాబితా విడుదల
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి


