● లోకేశ్ రిజైన్ చేయాల్సిందే
● సీబీఐ విచారణకు డిమాండ్
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(అర్బన్): పక్కా ప్రణాళికతోనే డీఎస్సీలో అక్రమాలు చేసి తామనుకున్న వారికి టీచర్ పోస్టులను ప్రభుత్వం ఇప్పించుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ మేరిగ మురళి, పార్టీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు గురవయ్య, కిలివేటి సంజీవయ్య తదితరులతో క లిసి కలెక్టరేట్లో డీఆర్వో విజయ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు. అక్రమాలకు సంబంధించి అభ్యర్థులు మాట్లాడుకున్న ఆడియోలను పెన్‌డ్రైవ్ ద్వారా సమర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాలతో అర్హత ఉన్న ఎంతో మంది నిరుద్యోగులు టీచర్ పోస్టుల ను కోల్పోయారని చెప్పారు. తమ పార్టీ నేతలతో పాటు లక్షలాది మంది యువత ఇదే అంశాన్ని ప్రశ్నిస్తున్నారని వివరించారు. అవుట్‌సోర్సింగ్ వ్యక్తికి డీఎస్సీలో కీలక బాధ్యతలను అప్పగించగా, ఆయనకే ప్రథమ ర్యాంక్ వచ్చిందని తెలిపారు. వెరిఫికేషన్‌కు హాజరుకాలేదనే నెపంతో సదరు వ్యక్తికి పోస్టును ఇవ్వలేమంటూ మసిపూసి మారేడు కాయ చేశారని విమర్శించారు. నిబంధనలను తుంగలో తొక్కి స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచారని ధ్వజమెత్తారు. సర్వీస్ రూల్స్‌ను సవరించి క్రీడల్లో పాల్గొన్న వారు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరంలేదనే జీఓను తెచ్చి అనేక మందికి పోస్టులను కట్టబెట్టారని ధ్వజమెత్తారు. 29 రకాల ఆటలను 64కు పెంచి, చివరికి పేకాట, టగ్ ఆఫ్ వార్‌ను సైతం క్రీడలుగా ప్రకటించి ఉద్యోగాలను కట్టబెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. తమ్ముళ్లకు పోస్టులను కట్టబెట్టాక, ఇక పొరపాట్లు జరగకూడదంటూ క్రీడాకారులు సైతం పోటీ పరీక్షలు రాయాల్సిందేనంటూ ఇప్పుడు జీఓ నంబర్ 56ను తెచ్చారని పేర్కొన్నారు. ఇలా 400 పోస్టులను అమ్ముకున్నారని మండిపడ్డారు.
సమాధానం చెప్పలేక..
నీట్ లీకేజీ విషయమై కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేసిన విధంగానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని లోకేశ్ తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని చర్చకు రావాలనడం సిగ్గుచేటన్నారు. నీ స్థాయెక్కడ.. జగన్‌మోహన్‌రెడ్డి స్థాయేంటో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితో చర్చకు రావాలని లోకేశ్‌కు పిలుపునిచ్చామని, దమ్ముంటే ఎక్కడికి.. ఎప్పుడు రావాలో చెప్తే వస్తారని సవాల్ విసిరారు. దొంగ సర్టిఫికెట్లతో టీడీపీ వారికి పోస్టులిప్పించిన లోకేశ్, ఆయన కుటుంబసభ్యులకు నైతిక విలువల్లేవని మండిపడ్డారు.
మెగా కాదు.. దగా డీఎస్సీ
సూపర్ సిక్స్ పేరుతో సూపర్ మోసాలను చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చి నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు. వసతి, విద్యాదీవెనలకు నిధులివ్వడంలేదని ధ్వజమెత్తారు. ఈ రెండు పథకాలకు రూ.9500 కోట్ల బకాయిలను పెట్టారని విమర్శించారు. నిరుద్యోగ భృతి విషయాన్నే విస్మరించారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి, విద్యార్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులను నిర్వహించి టీడీపీ అక్రమాలపై నిరుద్యోగులు, ప్రజలను చైతన్యం చేయనున్నామని ప్రకటించారు. లోకేశ్ రాజీనామా చేసేంత వరకూ పోరాటాలను ఉధృతం చేయనున్నామని స్పష్టం చేశారు. పార్టీ మహిళా విభాగ జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి కోటేశ్వరరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు జయకుమార్‌రెడ్డి, ఐటీ వింగ్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


