నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని ఉప్పు, మంచినీటి ఆక్వా రైతులు ఆప్సడా చట్టం మేరకు తమ చెరువులను నమోదు చేయించుకొని లైసెన్స్‌ను పొందాలని మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గ్రామ, వార్డు సచివాలయంలోని మత్స్య సహాయ పరిశీలకుడ్ని సంప్రదించాలని పేర్కొన్నారు. లైసెన్స్ పొందిన రైతులు మాత్రమే విద్యుత్ సబ్సిడీకి అర్హులని చెప్పారు. ఉప్పునీటి ఆక్వా రైతులు కోస్టల్ ఆక్వా అథారిటీ (సీఏఏ) అనుమతులను తప్పక కలిగి ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలోని 11 తీర మండలాలకు చెందిన సుమారు 3100 మంది వీటిని పొందాల్సి ఉందని వివరించారు. అనుమతుల్లేకుండా సాగు చేస్తే హెక్టార్‌కు రూ.పది వేల చొప్పున జరిమానాతో పాటు విద్యుత్ సబ్సిడీని రద్దు చేయనున్నామని పేర్కొన్నారు.
క్లాస్ – ఐఐ సభ్యుల
పదవీ కాలం రద్దు
వెంకటాచలం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోని క్లాస్ – ఐఐ, ఇతర సభ్యుల పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 67ను ఉన్నత విద్యాశాఖ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టం, 1991లోని సెక్షన్ 18 (2) మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2023, ఆగస్ట్ 31న జారీ చేసిన జీఓ నంబర్ 55 ద్వారా ఏర్పాటైన క్లాస్ – ఐఐ, ఇతర సభ్యుల నియామకాలను తక్షణమే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అనంతరం గెజిట్ ప్రచురణ నిమిత్తం సంబంధిత అధికారులు, వీఎస్‌యూ రిజిస్ట్రార్, ఉన్నత విద్య కమిషనర్, తదితర అధికారులకు ఉత్తర్వుల ప్రతులను పంపారు.
స్కానింగ్ సెంటర్లలో
ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు(అర్బన్): నగరంలోని పలు స్కానింగ్ సెంటర్లను పీసీ పీఎన్డీటీ చట్టం అమలు నోడల్ ఆఫీసర్ బ్రిజిత ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయా డ యాగ్నొస్టిక్స్ సెంటర్, ఆండాళ్ భాస్కర్ ఆస్ప్రత్రి, జీవీపీ, కాసా స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీలను చేపట్టారు. స్కానింగ్ యంత్రాలు, రికార్డులు, రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేశారని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏమైనా ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 233 2447ను సంప్రదించాలని సూచించారు. డెమో అధికారి కనకరత్నం, డిప్యూటీ డెమో అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి
తల్లిపాల వారోత్సవాలు
నెల్లూరు(పొగతోట): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో శనివారం నుంచి ఈ నెల ఏడు వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించనున్నామని, విజయవంతానికి సీడీపీఓలు చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక అంశాలతో కార్యక్రమాలను రోజూ నిర్వహించాలని సూచించారు. ర్యాలీలు, ప్రతిజ్ఞలను నిర్వహించి.. వీటి ఫొటోలను జిల్లా కార్యాలయానికి పంపాలని కోరారు. నిబంధనల మేరకు నిర్వహించాలని ఆదేశించారు.
అథ్లెటిక్స్ మీట్‌లో
అకార్డ్ స్కూల్ ప్రతిభ
తిరుపతి రూరల్: సీబీఎస్‌ఈ క్లస్టర్ – 7 అథ్లెటిక్స్ మీట్‌లో తిరుపతికి చెందిన అకార్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరోసారి సత్తా చాటింది. వరుసగా రెండో ఏడాదీ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన మీట్‌లో ఇక్కడి విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబర్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 280 పాఠశాలల నుంచి ఆరు వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. 33 స్వర్ణ, రజత, కాంస్య పతకాలను మూడు చొప్పున సాధించారని ప్రిన్సిపల్ నీరజారెడ్డి తెలిపారు. 168 చాంపియన్‌షిప్ పాయింట్లను సాధించి, పదేళ్లలో ఏ పాఠశాల నమోదు చేయని అత్యధిక స్కోరును సాధించి కొత్త రికార్డును సృష్టించామని వివరించారు. విజేతలను స్కూల్ డైరెక్టర్లు ప్రశాంత్‌రెడ్డి, వివేక్‌రెడ్డి తదితరులు అభినందించారు.


