బరువైన బాధలు.. తెంచుకున్న బంధాలు | - | Sakshi
Sakshi News home page

బరువైన బాధలు.. తెంచుకున్న బంధాలు

Aug 1 2026 12:16 AM | Updated on Aug 1 2026 12:16 AM

జీవితంలో ఎదురైన విభేదాలు, ఆర్థిక కష్టాలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. మనోవేదన.. క్షణిక నిర్ణయం విషాదాంతంగా మారింది. జీవితంలో ఓడిపోవడంతో బరువైన బాధలు బంధాలను తెంచుకున్నాయి. తమనే నమ్ముకున్న కుటుంబ ఆశలు ఆవిరి చేస్తూ కన్నీళ్లు మిగిల్చారు. దంపతుల మధ్య నెలకొన్న విభేదాలతో ఓ భర్త, సోదరుడితో ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఓ తమ్ముడు, షేర్‌ మార్కెట్‌లో భారీ నష్టాలు ఎదుర్కొన్న ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడ్డారు. వేర్వేరు కారణాలైనా, మూడు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

కుటుంబ కలహాలతో..

గూడూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. పీఎస్సార్‌ పార్కు సమీపంలో పాలెం నాగేంద్ర (33) తన భార్య హేమలతతో కలిసి నివసిస్తున్నారు. వీరికి సంతానం లేరు. నాగేంద్ర స్థానిక కోడిగుడ్ల ఏజెన్సీలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భార్య నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా వీరి మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో నాగేంద్ర మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. కేసును శుక్రవారం నమోదు చేశారు.

చెరువులో దూకి..

మనుబోలు: చెరువులో దూకి ఓ గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనుబోలు మండలంలోని జట్ల కొండూరులో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన వెందోటి వెంకటేశ్వర్లు (27) నాలుగు నెలల క్రితం డబ్బుల విషయమై తన అన్నతో గొడవపడ్డారు. అప్పటి నుంచి మనుబోలు మండలం కొండూరుసత్రంలో భార్య చిన వెంకమ్మతో ఉంటున్నారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో తెలియదు గానీ మద్యం తాగి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వెంకమ్మ కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

షేర్లలో పెట్టుబడి పెట్టి.. నష్టపోయి..

పొదలకూరు: బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ షేర్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో శుక్రవారం స్వగ్రామం కొత్తకంభాలపల్లిలో విషాదం నెలకొంది. చేజర్ల మండలం ఆదూరుపల్లికి చెందిన రాధను తల్లిదండ్రులు కొత్తకంభాలపల్లిలో సమీప బంధువుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఆమెతో పాటు భర్త కూడా బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, రాధ షేర్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోవడంతో ఆమె భర్త ఫోన్‌ నంబర్‌ను రాసి కుప్పం రైల్వేస్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని కొత్తకంభాలపల్లికి తీసుకురావడంతో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement