● స్కీమ్ వర్కర్లతో వెట్టిచాకిరీ
చేయిస్తున్న ప్రభుత్వం
● కలెక్టరేట్ వద్ద బైఠాయింపు
నెల్లూరు(అర్బన్): అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వెలుగు వీఓఏలు, స్కూల్ ఆయాలు తదితర స్కీమ్ వర్కర్లకు వేతనాలను పెంచేంత వరకూ ఉద్యమిస్తామని అంగన్‌వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు రెహనాబేగం, ఆశ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ స్పష్టం చేశారు. తమకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంతో పాటు పనిభారాన్ని తగ్గించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం బైఠాయించి ధర్నా జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆయాలకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలను అందజేస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. మధ్యాహ్న భోజనాన్ని వండే కార్మికులకు రూ.మూడు వేలనే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. 15 ఏళ్లలో ధరలు పెరిగినా, స్కీమ్ వర్కర్లకు వేతనాలను పెంచకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికై నా మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కో విద్యార్థికి మెనూ చార్జీలుగా కనీసం రూ.20 ఇవ్వడంతో పాటు బిల్లులను ప్రతి నెలా ఐదులోపే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఆయాలు, వర్కర్లకు కనీస వేతన చట్టం ప్రకారం రూ.26 వేలను ఇవ్వాలని పేర్కొన్నారు. నవ చేతన యాప్‌ల ద్వారా ఇంటింటి ఆరోగ్య సర్వే చేయించడం సరికాదన్నారు. గతంలో తాము సమ్మె చేపట్టిన సమయంలో చంద్రబాబు వచ్చి ఎన్నికల్లో గెలిస్తే జీతాలను పెంచుతానని నమ్మబలికి ఇప్పుడు పత్తాలేకుండాపోయారని విమర్శించారు.
జేసీకి వ్యతిరేకంగా నినాదాలు
ధర్నా జరుగుతున్న సమయంలో కలెక్టరేట్లోకి వచ్చేందుకు జేసీ వెంకటేశ్వర్లు యత్నించారు. అక్కడ ధర్నా చేస్తున్న మహిళలు కారును చుట్టుముట్టి.. తమ బాధలను వినాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన వాహనం దిగకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల సహకారంతో కలెక్టరేట్లోకి వెళ్తుండగా, కనీసం వాహనం దిగి అర్జీ తీసుకోవచ్చు కదా అంటూ మహిళలు ప్రశ్నించారు. అయినా ముందుకు సాగడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నేతలు గోగుల శ్రీనివాసులు, ప్రసాద్, పెంచలనరసయ్య, అంగన్‌వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.


