నెల్లూరు(అర్బన్): పరిపాలనా సౌలభ్యం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. అప్పట్లో కొత్త జిల్లాల్లో పరిపాలనకు ఇబ్బంది లేకుండా పాత జిల్లాల నుంచి ఉద్యోగులను సర్దుబాటు ప్రక్రియలో నియమించారు. స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఉద్యోగులను విభజించేందుకు 2025 డిసెంబర్ 15న రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) జారీ అయ్యాయి. కొత్త జిల్లాలకు అనుగుణంగా స్థానిక కేడర్లను పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పించారు. ఈ ప్రక్రియను 18 నెలల్లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అయితే గడువు ముగియడానికి ఇంకా దాదాపు ఏడాది సమయం ఉన్నప్పటికీ, వచ్చే నెలలోపు ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోనూ కలెక్టర్ ఆధ్వర్యంలో హడావుడిగా ఈ తంతు కొనసాగుతోంది. ఈ తొందరపాటు వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రణాళిక లేకుండానే..
ఉద్యోగులకు సంబంధించి టీఏ, డీఏ, ఐఆర్, పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. ఉద్యోగుల బదిలీలపై ఫ్రీజింగ్ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో విభజన చేపడితే పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. కొత్త జిల్లాల్లో ఇల్లు వెతుక్కోవడం, అద్దెలు చెల్లించడం, పిల్లల్ని కొత్త పాఠశాలల్లో చేర్పించడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కూడా ఇబ్బందిగా మారుతుంది. ఫలితంగా ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. తొందరపాటు విభజనతో సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి.
కొత్త జిల్లాల ప్రకారం..
గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో గూడూరును తిరుపతి జిల్లాలో, కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపారు. ఆ మేరకే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అనంతరం కూటమి ప్రభుత్వం గూడూరును తిరిగి నెల్లూరులో, కందుకూరును ప్రకాశం జిల్లాలో విలీనం చేసింది. దీంతో అప్పటి కొత్త జిల్లాల ఆధారంగా జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రస్తుతం గూడూరు, కందుకూరుకు వర్తిస్తాయా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. అయినప్పటికీ విభజన ప్రక్రియ కొనసాగుతుండటంపై ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్లకే ఎక్కువ నష్టమా?
విభజనకు సంబంధించి ఇప్పటికే ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు తమ ఆప్షన్లు నమోదు చేస్తున్నారు. అయితే స్థానికతకు పెద్దపీట వేయకుండా సీనియార్టీని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటున్నారని జూనియర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు తడకు చెందిన ఓ వ్యక్తి నెల్లూరు కోరుకుంటాడు. నెల్లూరులో ఉండే జూనియర్ ఇక్కడ నుంచి పక్క జిల్లాలోని సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా పదోన్నతులు, ఇంక్రిమెంట్లలో కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విభజనతో సీనియర్లు, జూనియర్లు అనే రెండు వర్గాలుగా ఉద్యోగులు విడిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి సుమారు 18 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో కనీసం 4,300 మంది వరకు తిరుపతి జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. రెవెన్యూ, వైద్య, పోలీసు, ఉపాధ్యాయ తదితర 50కి పైగా శాఖల్లోని ఉద్యోగులు వేరే జిల్లాలకు వెళ్లిపోవాల్సి వస్తుంది. జోన్ కేడర్ నుంచి జిల్లా కేడర్ వరకు ఇలా జరుగుతుంది. దీంతో తాము తీవ్రంగా నష్టపోనున్నామని కొందరు పేర్కొంటున్నారు.
ఇలా చేస్తే..
జిల్లాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కొత్త జోన్లు, జిల్లా, డివిజన్‌ల వారీగా ఉద్యోగుల భర్తీ, కేటాయింపుల కోసం తగిన గడువు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికీ అనేక శాఖల్లో సీనియారిటీ జాబితాలు సిద్ధం కాలేదు. ఇతర జిల్లాలకు కేటాయింపులపై అభ్యంతరాలు తెలిపేందుకు కనీసం 30 రోజుల గడువు ఇవ్వాలని, అప్పీళ్లను పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈలోపు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించి, బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తొందరపాటు కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని, లేదంటే న్యాయపరమైన, కోర్టు సంబంధిత సమస్యలతో పాటు సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
గడువున్నా రాష్ట్రపతి ఉత్తర్వుల
పేరుతో హడావుడి
కొంతమందికి తీవ్ర అన్యాయం?
తొందరపాటు నిర్ణయాలు
వద్దంటున్న ఉద్యోగులు
గడువు ఇచ్చి అభ్యంతరాలు
స్వీకరించాలని విజ్ఞప్తి


