నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని ఎస్‌ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.
● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్‌కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.
రాష్ట్ర స్థాయి రోయింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
నెల్లూరు (టౌన్): రాష్ట్ర స్థాయి రోయింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో నెల్లూరు క్రీడాకారులు సత్తా చాటారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ సెంటర్‌లో ఆదివారం స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో సింగిల్, డబుల్ స్కల్స్ అంశాలపై పోటీలు జరిగాయి. సబ్ జూనియర్ బాలుర విభాగంలో ఎం.కుశాల్ (బంగారు పతకం), బాలికల విభాగంలో ఎం.జాగృతి (కాంస్య పతకం) సాధించారు.
బీసీ కాలనీలో నగదు,
బంగారం చోరీ
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. కాలనీకి చెందిన ఉప్పు కృష్ణంరాజు, పద్మ దంపతులు శనివారం ఉదయం మాలకొండకు వెళ్లి స్వామిని దర్శించుకుని సాయంత్రం ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోనికి వెళ్లి పరిశీలించగా బీరువా తాళం తీసి అందులో ఉన్న రూ.15 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు, జత కమ్మలు, కొన్ని వెండి వస్తువులు తీసుకెళ్లినట్లు గుర్తించారు.
28, 29 తేదీల్లో బాలల హక్కుల పరిరక్షణ
కమిషన్ పర్యటన
నెల్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు, సభ్యురాలు కేజీ వెంకట పద్మలత ఈనెల 28, 29 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, స్కాన్ సెంటర్లు, బాలల గృహాలు, పరిశ్రమలు తదితరాల్లో పరిస్థితులను పరిశీలిస్తారన్నారు. 29న కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో బాలల, రక్షణ, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం అమలు, బాల కార్మిక నిర్మూలన, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రత, శిశు ఆరోగ్యం, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలతో సమావేశమై వినతులు స్వీకరిస్తారని తెలియజేశారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.45
సన్నవి : రూ.25
పండ్లు : రూ.10


