● అధికారం లేకున్నా వైఎస్సార్‌సీపీలో చేరికలు
● మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముత్తుకూరు(పొదలకూరు): ‘ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అధికారం లేకున్నా టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలే ఇందుకు నిదర్శనం’ అని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి చెందిన 20 కుటుంబాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు సమన్వయకర్త గురవయ్య సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకాణి వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. కాకాణి మాట్లాడుతూ అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీలో చేరడం చూస్తే కూటమి ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్‌సీపీకే సాధ్యమన్నారు. తాళ్లపూడిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అధికారంలో ఉన్న టీడీపీ కనీసం మంచినీటిని కూడా గ్రామస్తులకు అందించకపోతున్నట్టు ఆరోపించారు. హైకోర్టుకు వెళ్లి గ్రామస్తులకు గుక్కెడు మంచినీటిని అందివ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టు తెలిపారు. కక్షసాధింపులు తప్పించి అభివృద్ధి పనులు లేవన్నారు. తమ నాయకత్వంపై నమ్మకంతో అధికారం వీడి వైఎస్సార్‌సీపీలోకి రావడం సాహసోపేతమైన చర్యగా తెలిపారు. పా ర్టీలోకి వచ్చిన వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. చేరికల పేరుతో టీడీపీ డ్రామాలకు తెరలేపినట్టు కాకాణి విమర్శించారు. ఆ పార్టీలోకి కొత్తవారు చేరకపోవడంతో ఉన్నవారినే చేర్చుకుంటూ డ్రామాలు ఆడుతున్నట్టు ఆరోపించారు.


