● యాంత్రీకరణ పథకం అమలులో జాప్యం
● జిల్లాకు కేటాయించింది తక్కువ మొత్తమే..
● 2025 – 26 నిధులు
ఇప్పటికీ ఖర్చు కాని పరిస్థితి
● కూలీల కొరత, పెరిగిన
వ్యయంతో ఇబ్బందులు
నెల్లూరు(వేదాయపాళెం): రైతులకు సబ్సిడీపై అందించాల్సిన వ్యవసాయ యంత్రాల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో యాంత్రీకరణ లక్ష్యమే ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించేందుకు ఉద్దేశించిన సబ్ మెషీన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) పథకం అమలులో జాప్యం కారణంగా రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఏం చేయాలంటే..
ఈ పథకం కింద మినీ ట్రాక్టర్లు, 40 హెచ్‌పీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటావేటర్లు, విత్తన గొర్రులు, గుంతలు తీసే యంత్రాలు, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అర్హులైన రైతులకు అందించాల్సి ఉంది. అయితే జిల్లాలకు నిధులిచ్చినా.. లబ్ధిదారుల ఎంపిక, యంత్రాల పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు కేటాయించినప్పటికీ, 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలు గడిచినా యంత్రాల పంపిణీ ప్రారంభం కాకపోవడం రైతుల్లో అసంతృప్తి పెంచుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పథకం అమలులో జాప్యం వల్ల నిధులు వినియోగం కాకుండానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.
కేవలం రూ.4 కోట్లే..
అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 4.48 లక్షల ఎకరాల సాగు భూమి, 3.75 లక్షల మంది రైతులున్నారు. ఇంత పెద్ద వ్యవసాయ విస్తీర్ణం ఉన్న జిల్లాకు మెకనైజేషన్ కింద కేవలం రూ.4.1 కోట్లు మాత్రమే కేటాయించారు. సమీప జిల్లాలకు రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం సవాళ్లను ఎదుర్కొంటోంది. మరోవైపు కూలీల కొరత, పెరిగిన వ్యయం రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాలు అందుబాటులోకి వస్తే సాగు ఖర్చు తగ్గడంతోపాటు పనులు వేగంగా పూర్తై దిగుబడులు మెరుగుపడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో యంత్రాల పంపిణీ చేపట్టి మెకనైజేషన్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
త్వరలో అర్హుల
జాబితా ప్రకటిస్తాం
జిల్లా వ్యాప్తంగా 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. అతి త్వరలో అర్హుల జాబితా ప్రకటించి యంత్ర సామగ్రిని అప్పగిస్తాం.
– పి.సత్యవాణి,
జిల్లా వ్యవసాయాధికారిణి


