పట్టా భూమిలో పచ్చముఠా మట్టి దోపిడీ | - | Sakshi
Sakshi News home page

పట్టా భూమిలో పచ్చముఠా మట్టి దోపిడీ

Jul 27 2026 12:12 AM | Updated on Jul 27 2026 12:12 AM

యథేచ్ఛగా తరలింపు

అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని హుకుం

కావలి: అధికార మదంతో పచ్చ ముఠా బరి తెగింపు పతాక స్థాయికి చేరింది. ఇప్పటి వరకు చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టిని కొల్లగొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా రైతుల పట్టా భూమిలోకి చొరబడి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని బాహాటంగానే దౌర్జన్యానికి తెగబడుతున్నారు. మా భూమిలో మా అనుమతి లేకుండా తవ్వడానికి నీకెవడు అనుమతిచ్చాడని సదరు రైతు నిలదీస్తే.. నేను టీడీపీ వాడిని.. నాకెవడు అనుమతులివ్వాల్సిన అవసరం లేదంటూ తలకెక్కిన గర్వధోరణితో మాట్లాడటం చూసి స్థానికులు నివ్వెరపోయారు. వివరాల్లోకి వెళ్తే.. కావలి మండల కొత్తసత్రం పంచాయతీ రెడ్డిపాళేనికి చెందిన పుల్లా సోమయ్యకు గతంలో ప్రభుత్వం సర్వే నంబర్‌ 1800–1లో 40 సెట్లు, 1789–2లో 55 సెంట్లు భూమిని మంజూరు చేసింది. దానికి సంబంధించి పట్టాదార్‌ పాసుపుస్తకం, వన్‌బీ అడంగళ్‌ కూడా ఆయన పేరిటనే ఉన్నాయి. ఈ భూమిలో కూరగాయలు, మెట్ట పైర్లు సాగు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమయ్య అనారోగ్యంతో మరణించడంతో భార్య తిరుపతమ్మ తన కుమారుడుతో కలిసి అష్టకష్టాలు పడుతూ ఆ భూమిని సాగు చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్నారు. తిరుపతమ్మ సైతం అనారోగ్యానికి గురికావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటుంది. ఆమె కుమారుడు కూడా తల్లికి అండగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన అధికార పార్టీకి చెందిన గోవిందరెడ్డి కన్ను ఆ పేద కుటుంబం సాగు చేసుకునే భూమిపై పడింది. ఈ క్రమంలో పేద రైతు భూమిలో ఆదివారం జేసీబీ పెట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తవ్వేసి తరలిస్తుండగా స్థానికులు ఇదేం అన్యాయమని నిలదీస్తే మీరెవరు.. మీకేంటి సంబంధం.. భూమి నాది.. నా ఇష్టం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ బెదిరింపులకు దిగాడు. ఆ కుటుంబానికి ఆ పొలమే జీవనాధారమైతే.. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఆస్పత్రిలో ఉంటే.. ఈ సమయంలో ఇంతటి దౌర్జన్యానికి తెగబడటంపై స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వారిని లెక్క చేయకుండా మట్టిని తరలించాడు. దీంతో టీడీపీ నేత దౌర్జన్యంపై స్థానిక వీఆర్వోకు ఫిర్యాదు చేసి, ఆ పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement