నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో పార్టీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 82,255 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 32,683 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
పాస్‌పోర్ట్ ప్రత్యేక
అపాయింట్మెంట్ డ్రైవ్
నెల్లూరు రూరల్: ప్రజలకు మెరుగైన పాస్‌పోర్ట్ సేవలను అందించేందుకు గానూ ప్రత్యేక పాస్‌పోర్ట్ అపాయింట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నామని నెల్లూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 18, ఆగస్ట్ ఒకటిన ప్రత్యేక స్లాట్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ తేదీల్లో అపాయింట్మెంట్‌ను బుక్ చేసుకోవచ్చని వివరించారు. రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు, స్వీట్లు పంపే అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సర్ ప్రక్రియ
నూరు శాతం పూర్తి
నెల్లూరు(అర్బన్): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ జాబితా (సర్)కు సంబంధించిన ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్‌ను నూరు శాతం పూర్తి చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 19,74,240 మంది ఓటర్లకు గానూ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు.
జిల్లా స్థాయి
బ్యాడ్మింటన్ పోటీలు రేపు
నెల్లూరు (టౌన్): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి బ్మాడ్మింటన్ పోటీలను శనివారం నిర్వహించనున్నామని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాఽథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ – 13, 17, 19 మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో పోటీలను జరపనున్నామని వివరించారు. ఇక్కడ గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేయనున్నామని వెల్లడించారు. హాజరవ్వాలనుకునే వారు పుట్టిన తేదీతో ఉన్న ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని కోరారు. ఆసక్తి గల వారు తమ వివరాలను శుక్రవారం సాయంత్రం ఏడు గంటల్లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.
పంటల బీమాతో
రైతుకు భరోసా
నెల్లూరు(వేదాయపాళెం): ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలతో రైతులకు భరోసా లభిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసుత ఖరీఫ్ సీజన్లో రైతులు తమ పంటలను బీమా చేయించుకొని ప్రకృతి వైపరీత్యాలతో కలిగే నష్టాల నుంచి రక్షణ పొందాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ప్రీమియాన్ని చెల్లించాలని కోరారు. వేరుశనగ పంటకు ఎకరాకు రూ.280 చెల్లిస్తే రూ.28 వేలు.. వరి ఎకరాకు రూ.840 ప్రీమియానికి రూ.42 వేల నష్టపరిహారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. పత్తి పంటకు ఎకరాకు రూ.రెండు వేలను చెల్లిస్తే పరిహారంగా రూ.40 వేలను పొందొచ్చని వెల్లడించారు. సమీపంలోని ఆరెస్కేలు, కామన్ సర్వీస్ సెంటర్లు, పోస్టాఫీస్‌లు, నేషనల్ క్రాప్ ఇన్సురెన్స్ పోర్టళ్లను సంప్రదించాలని సూచించారు.


