కమీషన్‌ ఇస్తేనే రుణం | - | Sakshi
Sakshi News home page

కమీషన్‌ ఇస్తేనే రుణం

Jul 17 2026 12:23 AM | Updated on Jul 17 2026 12:23 AM

నెల్లూరు (పొగతోట): జిల్లాలో మెప్మా, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే బ్యాంక్‌ లింకేజ్‌, సీ్త్రనిధి రుణాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. 5 నుంచి 10 శాతం వరకు కమీషన్‌ ఇవ్వాలని కింది స్థాయి సిబ్బంది మహిళలను డిమాండ్‌ చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వారికే వేగంగా రుణాలు మంజూరు చేస్తున్నారని, అర్హులైన పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

మంజూరులో అవకతవకలు

జిల్లాలో 35,120 స్వయం సహాయక సంఘాలున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రతినెలా పొదుపు చేస్తూ రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్ల బ్యాంక్‌ లింకేజ్‌ రుణాలు, రూ.250 కోట్ల సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్లకు పైగా బ్యాంక్‌ లింకేజ్‌ రుణాలు, రూ.300 కోట్లకు పైగా సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఫలితం కనిపించడం లేదు. గత నెలలో కమీషన్లకు సంబంధించి సిబ్బందికి చెల్లించిన నగదుపై పూర్తి ఆధారాలతో పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మితిమీరిన రాజకీయ జోక్యం

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం పెరిగిందనే విమర్శలున్నాయి. గ్రామాల్లో పనిచేస్తున్న కొందరు వీఓఏలను తొలగించి, కూటమికి అనుకూలంగా ఉన్న మహిళలను నియమించుకున్నారు. రుణాల మంజూరులో కూడా అధికార పార్టీ నాయకులు సూచించిన మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితం కుల సంఘాలకు చెందిన ఇద్దరు నాయకులు మహిళల ఆధార్‌ కార్డుల ఆధారంగా బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి, వారి పేర్లపై పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయించుకున్నట్లు సమాచారం. యూనిక్‌ నంబర్లు లేకుండానే మహిళల పేర్లపై రుణాలు మంజూరైనట్లు ఆరోపణలున్నాయి.

అధిక వడ్డీ వ్యాపారానికి?

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పలుకుబడి, ఆర్థికంగా బలమైన కొందరు మహిళలు తమకు అనుకూలంగా ఉండేవారితో గ్రూపులు ఏర్పాటు చేశారు. సుమారు 100 మందికిపైగా మహిళలతో ఈ తరహా గ్రూపులు పెట్టి ఒక్కోదానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంక్‌ లింకేజ్‌ రుణాలు తీసుకుంటున్నారు. ఆ నగదును ఇతరులకు అధిక వడ్డీకి ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు నిజమైన నిరుపేద మహిళలు మాత్రం రుణాలు అందక పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నారు.

మంజూరులో కూటమి నేతల జోక్యం

5 నుంచి 10 శాతం వరకూ డిమాండ్‌

యూనిక్‌ నంబర్‌ ఉన్న మహిళలకే రుణాల మంజూరంటూ విమర్శలు

ఓ నాయకుడి బినామీ గ్రూపులకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు

ఆధారాలతో

పోలీసులను ఆశ్రయించిన మహిళలు

ఉదాహరణకు..

ఇటీవల నెల్లూరుకు చెందిన ఓ మహిళ భర్త అనారోగ్యానికి గురికావడంతో శస్త్రచికిత్స, ఆస్పత్రి ఖర్చుల కోసం సుమారు రూ.2 లక్షలు అవసరమయ్యాయి. చేతిలో రూ.2 వేల మినహా మరే మార్గం లేకపోవడంతో అత్యవసరంగా రుణం కోసం సంబంధిత సిబ్బందిని సంప్రదించారు. 10 శాతం కమీషన్‌ ఇస్తే 48 గంటల్లో రుణం మంజూరు చేయిస్తామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో అంగీకరించగా, మూడు రోజుల్లోనే రుణం బ్యాంక్‌ ఖాతాలో జమైంది అనంతరం ఒప్పందం ప్రకారం 10 శాతం కమీషన్‌ చెల్లించారు.

కావలికి చెందిన ఓ నిరుపేద కుటుంబం వ్యవసాయ పనులు చేస్తోంది. పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయం కాగా కట్నకానుకలు, ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. పొదుపు సిబ్బందిని సంప్రదించగా 10 శాతం కమీషన్‌తో గ్రూపునకు బ్యాంక్‌ లింకేజ్‌ రుణం మంజూరు చేయించారు. గ్రూపులోని ముగ్గురు మహిళల ద్వారా రూ.3 లక్షలు అందించినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో అప్పులు పొందడం కష్టంగా మారింది. ప్రైవేట్‌ రుణదాతలు కులం, ప్రాంతం, ఆస్తుల వివరాలు పరిశీలించిన తర్వాతే రుణాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పేద మహిళలకు బ్యాంక్‌ లింకేజ్‌, సీ్త్రనిధి రుణాలే ఆధారంగా నిలుస్తున్నాయి. అయితే కింది స్థాయి సిబ్బంది వ్యవహారశైలితో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement