మూడు రోజులు కొట్టి.. హింసించారు | - | Sakshi
Sakshi News home page

మూడు రోజులు కొట్టి.. హింసించారు

Jul 17 2026 12:23 AM | Updated on Jul 17 2026 12:23 AM

పాడుబడిన పోలీస్‌ క్వార్టర్స్‌లో దాష్టీకం

అపస్మారక స్థితిలో స్టేషన్‌కు

ఏడుకొండలును తీసుకొచ్చారు

వివరాలు వెల్లడి

నెల్లూరు(పొగతోట): ఓ కేసులో తమను పోలీసులు మూడు రోజులు చితక్కొట్టి వదిలారని.. ఆపై మరో రెండు రోజుల పాటు నిర్బంధించారని ఏడుకొండలు లాకప్‌ డెత్‌ కేసులో రియాజ్‌, ప్రసాద్‌ వివరించారు. మనుబోలు పోలీస్‌స్టేషన్లో జరిగిన ఘటనపై పూర్తి వివరాలను మీడియా ఎదుట వీరు వివరించారు. నగరంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి గురువారం నిర్వహించారు. ఘటన వివరాలను రియాజ్‌, ప్రసాద్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

రోడ్డులో ఉంటే తీసుకెళ్లారు..

అక్కంపేట రోడ్డులో ఉన్న తమ ముగ్గుర్నీ ఖాకీలు శుక్రవారం తీసుకెళ్లి.. పాడుబడిన పోలీస్‌ క్వార్టర్స్‌లో చితక్కొట్టారని ఆరోపించారు. ఎస్సై హనీఫ్‌, పోలీసులు వచ్చి.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు తమను పోలీస్‌స్టేషన్లోనే ఉంచారని చెప్పారు. తాము తప్పు చేశామని అంగీకరించామని వివరించారు. వస్తువు రికవరీ అయిందని ఆదివారం సాయంత్రం చెప్పి, స్టేషన్‌ బెయిల్‌ కోసం ముగ్గురి వేలిముద్రలను తీసుకున్నారని పేర్కొన్నారు. సంతకాలు పెట్టించుకొని జామీన్‌ తెచ్చుకోమని పంపారన్నారు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌కు ఏడుకొండలు మినహా తామిద్దరం సోమవారం ఉదయం వచ్చామని చెప్పారు. మంగళవారం వరకు తమను అక్కడే ఉంచి ఏడుకొండలును కారులో అదే రోజు సాయంత్రం తీసుకొచ్చారని తెలిపారు. వాహనం నుంచి మాధవ్‌ అనే వ్యక్తి దిగి.. ఏడుకొండలు లేరా.. లేరా అని పిలిచినా చలనంలేదని వివరించారు. మాధవ్‌ వెళ్లి రైటర్‌ను తీసుకొచ్చారని, ఆ తర్వాత కారు గూడూరు వైపు వెళ్లిపోయిందన్నారు. గంట అనంతరం తెల్లపేపర్లపై సంతకాలు చేయించుకొని తమను పంపారని చెప్పారు. మోటార్‌ కొన్న వ్యక్తి వచ్చి ఏడుకొండలు లేవడం లేదురా.. గుండె దగ్గర బాగా వాచిపోయిందిరా అని చెప్పారన్నారు. వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి మరుసటి రోజు వదిలిపెట్టారన్నారు.

ప్రభుత్వ అరాచకాలు ప్రజలకు తెలియాలి

ఏడుకొండలు మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం హ్యాండోవర్‌ చేశారని కాకాణి తెలిపారు. దీన్ని పరిశీలిస్తే పోలీస్‌స్టేషన్లోనే రియాజ్‌, ప్రసాద్‌ ఉన్నారన్నారు. ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉందో ప్రజలకు తెలియాలని చెప్పారు. సాక్ష్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విషయాలను నిర్భయంగా తెలియజేసిన ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement