● అధికారుల నియంత్రణ శూన్యం
● పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి
చేజర్ల: నిషేధిత గడ్డి మందు విక్రయాలు జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జిల్లాకు చెందిన పెద్ద వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి అనేక ప్రాంతాల్లో బహిరంగంగా విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణ లోపం కారణంగా ఈ పరిస్థితి నెలకొందనేది అక్షర సత్యం. కుటుంబ కలహాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో కొందరు దీన్ని సేవించి ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలు. అయితే దీని కట్టడిపై శ్రద్ధ కొరవడింది. అధికారులకు వ్యాపారులు మామూళ్లను సమర్పించి విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
విషపూరిత రసాయనాలైన గ్లయ్‌పోసెట్, ప్యారాకిట్, క్లింటన్ తదితర రసాయనాలను దేశంలో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే ప్యారాకిట్ తప్ప మిగిలిన బ్రాండ్ల రసాయన ప్రభావాన్ని కొంత మేర తగ్గించి ఇతర రాష్ట్రాల్లో విక్రయాలకు రెండేళ్ల క్రితం అనుమతించారు. అయితే రాష్ట్రంలో మాత్రం నిషేధం కొనసాగుతోంది. ఈ క్రమంలో జిల్లాలోని ఫర్టిలైజర్ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని రాపూరు, పొదలకూరు, ఆత్మకూరు, కలువాయి, సైదాపురం, గూడూరు, చేజర్ల, ఆదూరుపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సైతం అమ్ముతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కఠిన చర్యలు చేపడతాం
నిషేధంలో ఉన్న గడ్డి మందుల విక్రయాలను సహించేదిలేదు. ఈ విషయంలో ఎవర్నీ ఉపేక్షించేదిలేదు. అవసరమైతే ఆయా వ్యాపార సంస్థల గుర్తింపును శాశ్వతంగా రద్దు చేసి క్రిమినల్ కేసులనూ నమోదు చేస్తాం
– సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి


