● లారీని ఢీకొట్టిన ఆటో
● మహిళ దుర్మరణం
కోవూరు: మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. యల్లాయపాళెం గ్రామానికి చెందిన ఆయేషా (40)కు వివాహమైంది. ఆమె కుమార్తె సోఫియా అనారోగ్యంతో ఉంది. దీంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు చూపించేందుకు ఆయేషా, సోఫియా, ఇద్దరు కుటుంబ సభ్యులు ఆటోలో బయలుదేరారు. డాక్టర్ వద్ద చూపించాక తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో కోవూరు సమీపంలోని చౌదరి (ఆర్‌కే) పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో అదుపుతప్పి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయేషా చనిపోయింది. ముగ్గురూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.


