కూటమి పాలనలో అల్లాడుతున్న అన్నదాతలు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో అల్లాడుతున్న అన్నదాతలు

Mar 19 2026 7:34 AM | Updated on Mar 19 2026 7:34 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మనుబోలు: ‘ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ మాటలు బోగస్‌. క్షేత్రస్థాయిలో మద్దతు ధర లభించక అన్నదాతలు అల్లాడుతున్నారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మనుబోలు కోదండరామపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అన్నదాతల సంక్షేమం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం మొక్కుబడిగా రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ధాన్యం పుట్టి రూ.20,306కి కొనుగోలు చేయాల్సి ఉండగా బీపీటీ కేవలం రూ.17 వేలకే వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని తెలిపారు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేసి 24 గంటల్లో నగదు రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మిన్నకుండిపోయారన్నారు. అధికారులను ఫోన్‌ ద్వారా సంప్రదిస్తే ప్రభుత్వం మాకు టార్గెట్‌ ఇచ్చిందని, అంతకు మించి కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ జమ కాలేదని, తుఫాన్‌ సమయంలో నాసిరకం విత్తనాలు సరఫరా చేశారని, అధికారులు సహకరించడం లేదని రైతులు తమ వద్ద గొల్లుమంటున్నారని తెలిపారు. సోమిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కు కాకుండా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బండేపల్లి బ్రాంచ్‌ కెనాల్‌కు సంబంధించి తాము సేకరించిన భూములకు పరిహారం అందజేశామన్నారు. సోమిరెడ్డి మాత్రం కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు తీసుకుని మట్టి పనులకు డబ్బులు చెల్లించాడని తెలిపారు.

బోగస్‌ జాబ్‌మేళా

జాబ్‌మేళాల పేరుతో సోమిరెడ్డి నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని కాకాణి ధ్వజమెత్తారు. వెయ్యి మందికి పైగా ఉద్యోగాలిచ్చామని డబ్బాలు కొట్టుకుంటున్నారని, వారి వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. తాము విచారణ చేసి నిగ్గుతేలుస్తామన్నారు. బోగస్‌ ఉద్యోగాలిచ్చి నిరుద్యోగుతో ఆటలాడుకోవడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, ముంగర రవీందర్‌రెడ్డి, గుర్రం ప్రభాకర్‌, బందిల వేణుగోపాల్‌, గిద్దంటి రమణయ్య, గుంజి రమేష్‌, ఆవుల తులసీరామ్‌, దాసరి భాస్కర్‌గౌడ్‌, కేవీఆర్‌ గౌడ్‌, చల్లా నవకోటి, తుపాకుల గిరి, భాస్కర్‌రెడ్డి, కోటేశ్వరగౌడ్‌, పార్థూ, సుధాకర్‌రెడ్డి, సుమంత్‌రెడ్డి, కమాలాకర్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement