నెల్లూరు(లీగల్): ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) బలపరిచిన అభ్యర్థి సీనియర్ న్యాయవాది సత్తు అంకయ్య సత్తా చాటారు. గత నెల 13వ తేదీ పోలింగ్ జరిగింది. బుధవారం ఫలితాలు వెల్లడించారు. నెల్లూరు నుంచి ఐదుగురు పోటీ చేశారు. ఏపీ బార్ కౌన్సిల్ మాజీ సభ్యులు సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి.. అంకయ్య మధ్య పోటీ తీవ్రంగా సాగింది. చివరికి అంకయ్యకు విజయం దక్కింది. ప్రస్తుతం ఆయన ఐలు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంకయ్యను సీనియర్ న్యాయవాదులు బీవీ రమణరెడ్డి, పి.విజయకుమార్‌రెడ్డి, కటారి అజయ్‌కుమార్, జి.బాలసుబ్రహ్మణ్యం, కుడుమల రవికుమార్, జల్లి పద్మాకర్, వేలూరు రంగరావు, సలీం అభినందించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఐలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంకయ్యను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐలు నాయకులు రమేష్, పీఎన్ సాయి, పి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


