● కొనసాగిన ఏసీబీ తనిఖీలు
● పలు ఫైళ్ల పరిశీలన
నెల్లూరు(బారకాసు): నగరంలోని నుడా కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు బుధవారం కూడా కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో రెండు బృందాలు సోదాలు చేశాయి. పలు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక బృందం కార్యాలయంలోని ప్రణాళికా విభాగంలో కీలకమైన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులను విచారించారు. మరో బృందం ఆర్‌అండ్‌బీ, ప్రణాళికా విభాగాధికారుల సహకారంతో పలు భవనాలను పరిశీలించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు చదరపు గజానికి రూ.165 నుంచి రూ.250లు వరకూ ఉండాలి. అయితే నుడా అధికారులు రూ.1 నుంచి రూ.93 వరకూ రేట్లు తక్కువగా అంచనా వేసి 45 భవనాలకు అనుమతులు మంజూరు చేశారని డీఎస్పీ తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వా ఖజానాకి రూ.కోట్లలో నష్టం వచ్చిందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ పది శాతానికి మించిన వ్యత్యాసాలున్న అనేక భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేశారన్నారు. తుడా పరిధిలో ఉన్న పలు లేఅవుట్లపై నుడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యాలయంలో ముఖ్యమైన అనేక రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించలేదని గుర్తించామన్నారు. అదేవిధంగా ఫైల్ ప్రాసెసింగ్‌లో అసాధారణ జాప్యాలు జరిగినట్లుగా తెలుస్తుందన్నారు. అక్రమాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నామని డీఎస్పీ తెలిపారు. ఏసీబీ ఆకస్మిక తనిఖీలతో తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని నుడా కార్యాలయ అధికారులు, ఉద్యోగుల్లో గుబులు పట్టుకోగా మరోవైపు ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తనిఖీల ప్రక్రియలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.


