కలెక్టరేట్లో ఉగాది సంబరాలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): ఉగాది.. పండగ మాత్రమే కాదని, సంప్రదాయాల సుగంధం, మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే వేడుక అని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఉగాది సంబరాలను వేడుకగా గురువారం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను గతేడాదిలో విజయవంతంగా కొనసాగించామని, ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది మరింత అభివృద్ధి సాధించాలని కాంక్షించారు. బాల్య వివాహాల నిర్మూలన, ప్రతి ఒక్కరికీ విద్య అందేలా కృషి చేయడం తదితర అంశాల్లో ప్రజలందరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు.
ఉత్సాహంగా..
పరాభవ నామ సంవత్సరాది ఉగాది పంచాంగాన్ని ఆలూరి శిరోమణిశర్మ వినిపించారు. ప్రముఖ వేద పండితులను దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్క రించారు. కవులు, కళాకారులు, వివిధ రంగాల ప్రము ఖులను సన్మానించారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇన్‌చార్జి డీ ఆర్వో మహేశ్వరరెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ, ఆర్డీఓ అనూష, మెప్మా పీడీ లీలారాణి పాల్గొన్నారు.


