● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు
● మహిళలతో కలిసి రోడ్డుపై కట్టెల
పొయ్యిలపై వంటా వార్పుతో నిరసన
● ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ర్యాలీ
నెల్లూరు (వీఆర్సీసెంటర్): పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కేంద్రం సృష్టించిన కృత్రిమ సంక్షోభమే గ్యాస్ కొరత అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, పుష్కలంగా నిల్వలు ఉన్నాయని ఒక పక్క చెబుతూనే మరో పక్క గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం, బుకింగ్‌లపై కాల పరిమితి విధించడం, దేశ రాజధానిలో కట్టెల పొయ్యిలపై ఆంక్షలు సడలించడం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించడంతోపాటు అందరికి అందుబాటులో గ్యాస్‌ను ఉంచాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలతో కలిసి రోడ్డుపై కట్టెల పొయ్యిలు పెట్టి వంటా, వార్పు చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాదాల వెంకటేశ్వర్లు, నెల్లూరు రూరల్ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ వంట గ్యాస్ కొరతతో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల కోసం ప్రజలు పనులు మానుకుని గ్యాస్ గోదాముల వద్ద పడికాపులు కాస్తున్నారన్నారు. కొరత కారణంగా నగరంలోని పలు హోటళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయని ఆరోపించారు. పరీక్షల సమయంలో వంట గ్యాస్ లేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, హోటళ్లలో పనిచేసే కార్మికులు పని లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రికల్ కుక్కర్లు, వంటనూనె, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు అవస్థ పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పెంచలనరసయ్య, అబ్దుల్ అజీజ్, షాహీనాబేగం, అరిగెల రమమ్మ, నాగేశ్వరరెడ్డి, శివాజీ, సురేష్, నాగేశ్వరరావు, షంషాద్ తదితరులు, పాల్గొన్నారు.


