● ఇఫ్తార్ విందులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముత్తుకూరు(పొదలకూరు) : శాంతి, సహనం, దయాగుణంతో మెలగాలని ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం సందేశాన్ని ఇస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ముత్తుకూరులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ముత్తుకూరులోని ముస్లింలు గత 12 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇఫ్తార్ విందులో తనను భాగస్వామిని చేస్తున్నట్టుగా తెలిపారు. నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ముస్లిం సమాజమంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారని తెలిపారు. ముస్లిం కుటుంబాల బాగు కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ముస్లిం కుటుంబాలు నివశించే ప్రాంతాల్లో సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించానని గుర్తుచేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాకాణికి ముస్లింలు ఘనస్వాగతం పలికారు. మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, శివప్రసాద్, షేక్ అబ్దుల్ రహీం, జావీద్‌బాషా, షమ్ము, రవూఫ్, సిరాజ్, తాజ్, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, ఎం వెంకటశేషయ్య, చెంగారెడ్డి తదితరులు ఉన్నారు.


