ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు
● టెన్షన్‌తో పరీక్షకు హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా, నగరంలో 8 గంటల నుంచి 9 గంటల వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పాఠశాలల ప్రారంభం, ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఒకే సమయం కావడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 27 వేల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. నెల్లూరు నగరంలోనే దాదాపు 15 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను సమీప ప్రాంతాల్లో కాకుండా సుదూరంగా వేయడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. ఉదయం 9 గంటలకు డ్యూటీ కావడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ముందుగా కొద్దిమంది మాత్రమే హాజరైనట్లు తెలిసింది. ప్రధానంగా నగరంలోని స్టోన్‌హోస్‌పేట, పూలేవిగ్రహం, రామలింగాపురం, మద్రాసు బస్డాండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకుంటామా..లేదని విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పరీక్ష ముగిసిన తరువాత కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి విద్యార్థులతో పాటు ప్రజలు ఇబ్బందులుపడ్డారు.
తొలిరోజు 888 మంది గైర్హాజరు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 27,613 మంది విద్యార్థులకు గానూ 26,725 మంది హాజరయ్యారు. 888 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 82 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షుశుక్లా నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల, ఆర్‌ఐఓ వరప్రసాదరావు ధనలక్ష్మీపురంలోని నారాయణ, శ్రీచైతన్య, హరనాథపురంలోని బీవీకే పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీవీఈఓ 4, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 7, ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్ 32 సెంటర్లలో తనిఖీలు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముందుగానే అనుమతించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపారు. తొలి రోజు కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష ముగిసే వరకు కేంద్రాల వద్దే తల్లిదండ్రులు వేచి ఉన్నారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సమీపంలోని చెట్ల కింద సేద తీరారు.


