జిల్లాలో నాకాబందీ
● ముమ్మర తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారుల నిష్క్రమణ, ప్రవేశ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. 1,563 వాహనాలను తనిఖీ చేసి మితిమీరిన వేగం, ట్రిబుల్ రైడింగ్, మైనర్ రైడింగ్ తదితరాలపై ఎంవీయాక్ట్ కింద 142 కేసులు నమోదు చేసి రూ.1,12,485 అపరాధ రుసుం విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై 22 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్య సేవనంపై 18 కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 54 లాడ్జీలను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. లాడ్జీలో బసచేసిన వ్యక్తుల వివరాలను ప్రతిరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
టీడీపీ నేతల మధ్య ఘర్షణ
ఆత్మకూరు: పట్టణంలోని బీఎస్సార్ సెంటర్ వద్ద ఆదివారం టీడీపీ పట్టణాధ్యక్షుడు చంద్రారెడ్డితో కొమ్మి లక్ష్మయ్య నాయుడు వర్గానికి చెందిన రంతుల్లా అనే కార్యకర్త మధ్య చిన్న విషయమై వివాదం నెలకొంది. అనంతరం ఒకరినొకరు తోసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బీఎస్సార్ సెంటర్‌లో ఆటోలో ఇతర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కూరగాయలు విక్రయిస్తున్నాడు. కాగా అక్కడికి కూరగాయల మార్కెట్ సమీపంలోనే ఉండడంతో ఇక్కడ ఇలా వాహనం ద్వారా విక్రయించడం సరికాదని చంద్రారెడ్డి ఆ వ్యాపారితో మాట్లాడుతుండగా, రంతుల్లా కలుగజేసుకుని ఇక్కడ వారు వ్యాపారం చేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాదనలు జరిగాయి. రామనారాయణరెడ్డి వర్గీయులు టీడీపీని భ్రష్టు పట్టిస్తున్నారని రంతుల్లా ఆరోపించడంతో వారి మధ్య వివాదం మరింత పెద్దదైంది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని, సమీపంలోని వారు ఇరువురిని సర్దుబాటు చేయడంతో వివాదం సర్దుమణిగింది. ఈ విషయమై పోలీసు కేసు నమోదు కాలేదు.
అవెన్యూస్‌లో
అకడమిక్ బ్లాక్ ప్రారంభం
నెల్లూరు (టౌన్): దర్గామిట్టలోని అవెన్యూస్ స్కూల్లో కొత్త అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించినట్లు పాఠశాల నిర్వహణ సభ్యుడు కృష్ణచైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల విద్యా నైపుణ్యంతో విశాలమైన, అత్యాధునిక భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. అప్‌గ్రేడ్ చేసిన క్యాంపస్‌లో రోబోటిక్స్, ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేక ల్యాబ్‌లు, కేంద్రీకృత ఎయిర్ కండిషన్డ్ తరగతి గదులు, లైబ్రరీలు ఉన్నాయన్నారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న విద్య, సమగ్ర విద్యార్థుల అభివృద్ధిని అందించడంలో ఈ పాఠశాల విస్తరణ బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకుడు పొన్నవోలు దివ్యరెడ్డి, పెనుబల్లి రామకృష్ణ, పొన్నవోలు దీపక్‌రెడ్డి, పాఠశాల నిర్వహణ సభ్యులు కళా కృష్ణస్వామి, పెనుబల్లి బాబునాయుడు, డా.శ్వేతసంధ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వృద్ధుడి అనుమానాస్పద మృతి
నెల్లూరు(క్రైమ్): గుర్తుతెలియని వృద్ధుడు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ నాలుగో నంబర్ ప్లాట్‌ఫారమ్ చివరన ఆదివారం మృతిచెందాడు. మృతుని తల కుడివైపు కంటి వద్ద గాయమై ఉంది. అతను సుమారు 5.5 అడుగల ఎత్తు, 65 నుంచి 70 ఏళ్లలోపు వయస్సు కలిగి తెలుపుపై ముదురు ఊదారంగు గళ్ల ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, ఎరుపు రంగు అంచు కలిగిన గోధుమ రంగు పంచె ధరించి ఉన్నాడు. మృతుడు చెవిటి మెషీన్, నల్ల కళ్లజోడు పెట్టుకుని ఉన్నాడు. రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27644 నంబర్ లేదా నెల్లూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. అతను అనారోగ్యంతో కింద పడడంతో గాయమైందా? మరే ఇతర కారణం ఏమైనా ఉందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలో నాకాబందీ
జిల్లాలో నాకాబందీ


