టీడీపీ నేతల దౌర్జన్యం
● స్థలం విషయమై ఓ వ్యక్తిపై కత్తితో దాడి
● భయభ్రాంతులకు గురై యువతి
ఆత్మహత్యాయత్నం
సోమశిల: టీడీపీ నేతలు వాటర్ ప్లాంట్ నిర్మించాలనే సాకుతో ఓ కుటుంబంపై దాడులకు తెగబడిన ఘటన అనంతసాగరం మండల పరిధిలోని యాకర్లపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. తమ తాత చుక్కా లింగయ్యకు 50 ఏళ్ల నుంచి గ్రామంలోని మల్లెం కొండయ్య రచ్చ వద్ద కొంత స్థలం ఉంది. ఇందులో పేడదిబ్బ వేసుకుంటూ వినియోగిస్తున్నారు. కాగా లింగయ్య కొంతకాలం క్రితం మృతిచెందారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే నాలుగు నెలల క్రితం ఆ దిబ్బ వేసిన స్థలంలో వాటర్ ప్లాంట్ నిర్మించాలని టీడీపీ నేతలు ఇబ్బందులు పెడుతూ పలుమార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం మళ్లీ టీడీపీ నేతలు పంచాయితీ పెట్టినా లింగయ్య కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అనంతరం కొంత సమయానికి లింగయ్య మనుమడు మధు మీదకు నలుగురు టీడీపీ నేతలు దాడికి పాల్పడడంతో రెండో కుమార్తె కొడుకు మస్తాన్‌బాబు వెళ్లగా వారి చేతిలో ఉండే కొడవలితో తలపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఈ క్రమంలో మస్తాన్‌బాబును చికిత్స నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. కాగా ఇంటిపై దాడికి పాల్పడడంతో భయభ్రాంతులకు గురైన మస్తాన్‌బాబు చిన్నాన్న కుమార్తె వాస్మాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆ యువతిని నెల్లూరు వైద్యశాలకు తరలించారు. అధికార బలంతో ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడుతూ పేద కుటుంబీకులపై అత్యుత్సాహం ప్రదర్శించారని పలువురు గ్రామస్తులు అంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని గాయపడిన మస్తాన్‌బాబు తెలిపారు.


