ట్రాఫిక్‌లో నిలువు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌లో నిలువు దోపిడీ

Feb 23 2026 7:14 AM | Updated on Feb 23 2026 7:14 AM

ట్రాఫిక్‌లో నిలువు దోపిడీ

ట్రాఫిక్‌లో నిలువు దోపిడీ

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన సిబ్బందిలో కొందరు అసలు విధిని విస్మరించి జేబులు నింపుకోవడమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించారంటూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. చేతిలో డబ్బులు లేవని చెబితే తమకు తెలిసిన వారి ఫోన్‌పేలకు నగదు వేయమని వాహనదారులపై ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా సౌత్‌ ట్రాఫిక్‌ ఏఎస్సై వెంకటేశ్వర్లు ఫోన్‌పే చేయమని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం రాత్రి సదరు ఏఎస్సైను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

తనిఖీల పేరిట హడావుడి

నెల్లూరు నగరంలో కొందరు సిబ్బంది తనిఖీల పేరిట హడావుడి చేస్తున్నారు. వాహన పత్రాలు, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌, లైసెన్సులు లేనివారిని, ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తున్న వారిని ఈ–చలానాలు విధిస్తే రూ.వేలు కట్టాల్సి వస్తుందని భయపెడుతుండటంతో వాహనదారులు సిబ్బంది అడిగినంత ముట్టచెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు సిబ్బంది నేరుగా డబ్బులు చేతికి తీసుకోకుండా తమకు తెలిసిన వారి ఫోన్‌ నంబర్లకు ఫోన్‌పే చేయమని సూచిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు సిబ్బందికి కాసులు కురిపిస్తున్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల అపరాధ రుసుం కోర్టులో చెల్లించాల్సి ఉంటుంది. అంత డబ్బులు చెల్లించలేని నిరుపేదలు తమ వద్దనున్న నగదును ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతున్నారు. విధుల్లో అలసత్వం వహించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని పదేపదే పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా.. కొందరు సిబ్బంది తీరులో మార్పురావడం లేదు. దీంతో ఒక్కరిద్దరు వ్యవహారశైలి వల్ల ట్రాఫిక్‌ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది.

వాహనదారులను బెదిరించి

వసూళ్లకు పాల్పడుతున్న వైనం

ఫోన్‌పే చేయమని విద్యార్థులను ఒత్తిడి చేసిన ట్రాఫిక్‌ ఏఎస్సై

వీడియో వైరల్‌ కావడంతో

విధుల నుంచి సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement