చేపల తూకాల్లో మోసాలు
● కేజీలో 300 గ్రాముల కోత
● 15 కాటాల సీజ్, కేసు నమోదు
బుచ్చిరెడ్డిపాళెం: చేపల మార్కెట్‌లో కొలతల్లో జరుగుతున్న మోసాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీ సమీపంలో ఉన్న చేపల దుకాణాలపై ఆదివారం అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దుకాణాల్లోని తూకాలను తనిఖీ చేయగా, కిలోకు 100 నుంచి 300 గ్రాముల వరకు తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఎలక్ట్రానిక్ కాటాల్లో సాఫ్ట్‌వేర్ ట్యాంపరింగ్ చేయడం, తప్పుడు బరువులు వాడడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలిందని తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సుమారు 15 కాటాలను అధికారులు స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించినట్లు తెలియజేశారు. వ్యాపారస్తులు ఎవరూ చేతికర్ర కాటాలను వాడకూడదని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎలక్ట్రానిక్ కాటాలనే వాడాలని స్పష్టం చేశారు. కొత్త కాటాలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా సీల్ వేయించుకుని, లైసెన్సులు తీసుకోవాలన్నారు. అధికారులు ధ్రువీకరించిన ముద్ర లేకపోయినా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలను కోరారు.


