వేదనలోనూ చెదరని సంకల్పం
● తండ్రి మరణించిన కొన్ని గంటల్లోనే
పరీక్షకు హాజరైన ఇంటర్ విద్యార్థి
సంగం: విధి ఆటలో ఆ తనయుడికి ఒకే రోజు రెండు పరీక్షలు ఎదురయ్యాయి. ఒక వైపు తండ్రి మరణం.. మరో వైపు భవిష్యత్ పరీక్ష. దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని, కన్న తండ్రి కల నెరవేర్చాలనే సంకల్పంతో కుమారుడు కన్నీళ్ల మధ్య పరీక్ష కేంద్రానికి వెళ్లిన హృదయ విదారక ఘటన సంగంలో సోమవారం జరిగింది. సంగానికి చెందిన కందల శివకృష్ణ(43) కుమారుడు సాయిరామ్ స్థానిక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న క్రమంలో బాగా రాసి, భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థితికి ఎదగాలంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వచ్చిన తండ్రి తనయుడి పరీక్షకు కొన్ని గంటల ముందు (ఆదివారం రాత్రి) గుండెపోటుతో మరణించాడు. ప్రతిక్షణం ప్రేమానురాగాలు పంచిన తండ్రి మరణం ఒక వైపు, తన భవిష్యత్‌ను నిర్ణయించే పరీక్ష మరో వైపు ఆ విద్యార్థి లేత హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తనను అత్యుత్తమ విద్యావంతుడిగా తీర్చిదిర్చాలని భావించిన తండ్రి కోరికను తీర్చేందుకు.. తండ్రి మృతి చెందినా కూడా పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. విద్యార్థి పరిస్థితి ని తెలుసుకున్న కళాశాల కరస్పాండెంట్ మదహర్ బాషా స్వయంగా తనబైక్‌పై విద్యార్థిని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్ష అనంతరం ఇంటి వద్ద వదిలి పెట్టారు.
వేదనలోనూ చెదరని సంకల్పం


