వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై బలవంతపు కేసులు
● కాకాణి పూజిత
నెల్లూరు రూరల్: జంతుబలులపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను బెదిరించడానికి, నేరస్తులుగా ముద్ర వేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులు ప్రమాదకరమైనవని ఆ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. ఆదివారం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో బాలకృష్ణ సినిమాలు, చంద్రబాబు పుట్టినరోజులకు కనిపించని నేరం ఈరోజు అకస్మాత్తుగా నేరంగా పరిగణించడం దారుణమన్నారు. సామాజిక ఆచారంగా ఉన్న జాతర్లు, కొన్ని రకాల వేడుకలకు జంతుబలులు ఇప్పటికీ ఆచార వ్యవహారాలుగా ఉన్నాయన్నారు. పోలీసులు వాళ్లని దారుణంగా కొట్టి హక్కులు హరించి నేరస్తుల్లా రోడ్లపై నడిపించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో పోలీసులు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం మానవహక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. ఇటువంటి భావజాలం ఉన్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదన్నారు. సంసస్కృతిని నేరంగా మార్చి అసమ్మతిని శిక్షించినప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని హెచ్చరించారు. ఇప్పటికై నా వ్యవస్థలో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


