ప్రాణం తీసిన అతివేగం
● గుర్తుతెలియని వాహనం
ఢీకొని యువకుడి మృతి
● కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఘటన
కోవూరు: అతివేగం నిండు ప్రాణం తీసింది. కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోవూరు పరిధిలోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ యువకుడు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే కోవూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ముత్యాలరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతుడి వయసు సుమారు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


