స్వల్పంగా పెరిగిన నిమ్మ ధరలు
పొదలకూరు: పాతాళానికి పడిపోయిన నిమ్మ ధరలు స్వల్పంగా పెరిగాయి. కోత కూలీలు ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్న రైతులకు కొంతమేర ఊరట లభించింది. ప్రస్తుతం ఒక కిలో రూ.16 నుంచి రూ.20 వరకు ఉంది. బస్తా (లూజు) ఒకటి రూ.1,200 నుంచి రూ.1,600 వరకు ధరలు గిట్టుబాటవుతున్నాయి. సంక్రాంతి పండగ తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది.
బంగారు హారం బహూకరణ
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారికి నెల్లూరుకు చెందిన పోడ్ల రాజేశ్వరి ఆదివారం బంగారు హారం సమర్పించారు. ఆలయ సిబ్బంది అతిథి మర్యాదలతో సత్కరించి అమ్మవారి దర్శనం కల్పించారు.
పెంచలకోనలో వైకుంఠ ఏకాదశి వేడుకలు రేపు
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నట్లు ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పెంచలకోన క్షేత్రంలో శ్రీవారిని దర్శించేందుకు ఉత్తర ద్వారం ఉన్నా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో 7 బంగారు రంగుతో కూడిన ద్వారాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో బంగారు గరుడ వాహనంపై శ్రీవారిని కొలువుదీర్చడం జరుగుతుందన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు అభి షేకం, 4 గంటలకు నిజరూప దర్శనం, 5 గంటలకు పూలంగిసేవ, ఉత్తర ద్వార దర్శనం, సాయంత్రం 6 గంటలకు బంగారు గరుడ వాహనంపై క్షేత్రోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆటో డ్రైవర్ కోసం ముమ్మర గాలింపు
సంగం: మండల కేంద్రమైన సంగం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ పవన్ అదృశ్యమై రెండు రోజులైంది. కాగా ఆటో శనివారం రాత్రి ఉడ్‌హౌస్‌పేట సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువలో లభ్యమైంది. పవన్ ఆచూకీ లభించలేదు. అర్ధరాత్రి కావడంతో గాలింపు చర్యలను పోలీసులు నిలిపివేశారు. ఆదివారం కాలువలో నీళ్లు తగ్గించి గాలింపు చర్యలు ప్రారంభించినా అతని ఆచూకీ దొరకలేదు. సంగం ఉడ్‌హౌస్‌పేట నుంచి 15 కిలోమీటర్ల వరకు మర్రిపాడు సమీపం వరకు బెజవాడ పాపిరెడ్డి కాలువలో గాలించినా ఫలితం లేదు.
కండలేరులో
60.79 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 60.79 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
స్వల్పంగా పెరిగిన నిమ్మ ధరలు
స్వల్పంగా పెరిగిన నిమ్మ ధరలు


